నవతెలంగాణ ఢిల్లీ: పార్లమెంట్‌ను నేడు కూడా మణిపుర్ అంశం కుదిపేస్తోంది. పార్లమెంట్ ప్రారంభమైన దగ్గర నుంచి మణిపుర్ అంశంపై చర్చతోపాటు, ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయినా ప్రధాని మౌనం వీడటం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రకటన చేశారు. ”బిల్లును హౌంశాఖ నిబంధనలకు అనుగుణంగా రూపొందించింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని కేజ్రీవాల్ బందం గుర్తుంచుకోవాలి”అని జోషి అన్నారు. ఈ క్రమంలో మణిపుర్ అంశంపై చర్చకు ఇండియా కూటమి సభ్యులు పట్టుబడుతూ.. నినాదాలు చేయడంతో, సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేశారు. ఏలాంటి చర్చలు లేకుండా సభ నిరంతరం వాయిదా పడటానికైనా ప్రభుత్వం అంగీకరిస్తుందే తప్ప.. ప్రధాని మాట్లాడటానికి మాత్రం అంగీకరించడం లేదు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి 24గంటల్లో సమాధానం చెప్పాలని ఆదేశించినా మోడీ మాత్రం మౌనం వీడటం లేదు.
మరో వైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సభ ప్రారంభం కాగానే.. మణిపుర్ ఘటనపై చర్చ జరగాలని, ప్రధాని సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి సభ్యులు నినాదాలు చేశారు. ఒకే అంశంపై చర్చకు పట్టుబడుతూ సభకు అంతరాయం కలిగించొద్దని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పలుపార్లు విపక్ష సభ్యులకు సూచించారు. మణిపుర్ అంశంపై నిన్న చర్చ జరగాల్సి ఉందని, అది జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో విపక్ష కూటమి సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.