– బీజేపీని గ్రామాల్లో తిరగకుండా తరిమికొట్టాలి
– ధనబలం, ప్రజాసేవ మధ్య జరుగుతున్న పోటీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-చండూరు
మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు హోల్‌సేల్‌గా అమ్మేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలంలోని తేరట్‌పల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజల సంపదను, వాళ్ల శ్రమను దోచి కార్పొరేట్, ప్రయివేట్ వ్యక్తుల చేతిల్లో బీజేపీ ప్రభుత్వం పెడుతోందని అన్నారు. మోడీ మోసపూరిత మాటలతో మత, దేవుళ్ళ సెంటిమెంట్‌తో ప్రజలను మధ్యపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌరహక్కులను కాపాడుకునేందుకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పినప్పుడే మనుగడ ఉంటుందన్నారు. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించి అహంకారపూరితంగా పాలన కొనసాగించిందన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గ వెనకబాటుకు కారణం గత పాలకులే కారణమని అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలతో పాటు సాగు, తాగునీటి కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టులేనన్నారు. బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బూర నర్సయ్యగౌడ్‌కు.. గత ఎన్నికల్లో ఎంపీగా ఐదేండ్లు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధిని చూపించి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. ఇక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులకు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలియదన్నారు. సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ.. 35 ఏండ్లుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ప్రజా ఉద్యమాల్లో ఉండి పోరాడిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నాయకునిగా కాదు.. సేవకునిగా పనిచేస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గం సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, వివిధ మండలాల కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, చండూరు మాజీ మండల కార్యదర్శి బొట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.