మోడీజీ…ఈ ప్రశ్నలకు జవాబివ్వండి?

Modiji...answer these questions?– ఇంధన ధరల విధానం దోపిడీమయం
– లాభాలు దండుకున్న చమురు కంపెనీలు
– వినియోగదారులకు రిక్తహస్తం
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుతోంది. దీనికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు చమురు కంపెనీలు కూడా బాధ్యులే. ముడి చమురు ధరలు తక్కు వగా ఉన్నప్పుడు చమురు కంపె నీలు దానిని చౌకగా కొనుగోలు చేశా యి. ఆ తర్వాత వినియోగదారులకు ఒక్క రూపాయి కూడా బదిలీ చేయకుండా లాభాల మూటలు నింపుకు న్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉంటే ప్రభుత్వమేమో ఇంధనంపై పన్ను పెంచి, తద్వారా ఖజానాను నింపుకుంది. చివరికి చమురు కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా ఇంధన వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టింది.
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో రష్యా నుండి ముడి చమురును చౌకగా దిగుమతి చేసుకున్నప్పటికీ వినియోగదారులకు ఆ ప్రయోజనాలు దక్కలేదు. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం మామూలుగానే ఉన్నప్పటికీ మొత్తంగా ద్రవ్యోల్బణ రేటు పెరిగింది. ఇప్పుడు ఆహార ద్రవ్యో ల్బణం కూడా పెరుగుతోంది. అది వేరే విషయం. అసలు దేశంలో ఇంధన ధరలను ఎవరు నిర్ణయిస్తారు ? ఈ ప్రశ్నకు సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనమిక్‌ స్టడీస్‌ (సీఎన్‌ఈఎస్‌) బృందం ఇచ్చిన సమాధానం ఏమిటంటే…
ఎక్సైజ్‌ సుంకాల రూపంలో…
మన దేశంలో చమురు దిగుమతులకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్‌ స్థిరంగా పెరుగుతోంది. 2014-2022 మధ్యకాలంలో ముడి చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు సుమారు మూడు రెట్లు పెరిగాయి. 2014 ఏప్రిల్‌లో రూ.78,281 కోట్ల విలువైన చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా 2022 జూలైలో రూ.1,68,226 కోట్ల విలువైన చమురు ఉత్పత్తుల దిగుమతి జరిగింది. గత సంవత్సరం అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయాయి. కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వం పన్ను విధానాన్ని ఉపయోగించి పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తుల ధరల పెంపును కొనసాగించింది. చమురు, పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులు చిల్లర ధరలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి భారాన్ని వినియోగదారులు భరించాల్సిందే. ఉదాహరణకు రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.72. లీటరు డీజిల్‌ ధర రూ.89.62. ఈ ధరలపై ఎక్సైజ్‌ సుంకం 36%గానూ, వ్యాట్‌ 31%గానూ ఉంది. 2021 అక్టోబర్‌లో ఇంధన ధరలు అధికంగా ఉన్నప్పుడు ఈ పన్నులు 54%, 49% వరకూ వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వ్యాట్‌ కంటే కేంద్రానికి వెళ్లే ఎక్సైజ్‌ సుంకాలు అధికంగా ఉంటాయి. పెట్రోలియం రంగం నుండి ఖజానాకు చేరే ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకాలు 75-90% వరకు ఉంటున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినా, రష్యా నుండి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకున్నా ముడి చమురు దిగుమతి ధరల బిల్లులో కేంద్రానికి ఆర్థిక ప్రయోజనం ఎలా చేకూరింది? చమురు, గ్యాస్‌, పెట్రోలియం, పెట్రో కెమికల్‌ కంపెనీలు చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా ఏ మేరకు లాభాలు దండుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది? ఆ కంపెనీలు పొందిన లాభాలలో కొంత మేరకైనా వినియోగదారులకు ఎందుకు బదిలీ చేయలేదు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సింది మోడీ ప్రభుత్వమే.
2014 తర్వాత…
2002 వరకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అడ్మినిస్టర్డ్‌ ప్రైస్‌ మెకానిజమ్‌ నిర్ణయించేది. అనంతరం ఆ యంత్రాంగాన్ని రద్దు చేసినప్పటికీ ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలైన ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ వినియోగ దారుల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయి. అయితే 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయ ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంధన ధరలను రోజువారీగా నిర్ణయించడం మొదలు పెట్టాయి. కోవిడ్‌ సమయంలో ఇంధన ధరలు పెరగడంతో ఈ కంపెనీల లాభాలు కూడా బాగా పెరిగాయి. గ్యాస్‌ ధరల మాదిరిగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను మోడీ ప్రభుత్వం తొలుత అనుమతించింది. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయం, అటు కంపెనీల లాభాలు పెరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్‌ సుంకాల రూపంలో అధిక ఆదాయాన్ని పొందింది. 2018 నుండి ఈ సంవత్సరం ప్రారంభం వరకూ చమురు ధరలలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం అధి కంగా ఉంది. అధిక పన్నులు, సెస్సుల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు లబ్ది పొందాయే తప్ప వినియోగదారులకు ఒరిగిందేమీ లేదు.