– ఈసీకి ఫిర్యాదు చేశాం : సీతారాం ఏచూరి
కోజికోడ్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఉల్లంఘించేలా ప్రకటనలు చేశారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ‘రాముడి’ అంశంపై మతతత్వానికి పదును పెట్టటమే లక్ష్యంగా మోడీ చేసిన ప్రకటనలను జాబితా చేస్తూ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసినట్టు ఏచూరి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. లెఫ్ట్ ఫ్రంట్‌పై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా కాంగ్రెస్, యూడీఎఫ్‌లను కూడా ఆయన విమర్శించారు. ”ఎల్డీఎఫ్, ప్రత్యేకించి సీపీఐ(ఎం)ను.. మోడీపై దాడి చేయకుండా మౌనంగా ఉన్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్, యూడీఎఫ్‌లు ఆరోపించటం విచిత్రంగా ఉన్నది.పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ అరెస్టయిన తొలి రాజకీయ నేతలలో తానూ ఒకడిననీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో రాజకీయ నాయకులను నిర్బంధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది వామపక్ష పార్టీనే. ఎలక్టోరల్ బాండ్ల(ఈబీ)ను సుప్రీంకోర్టులో వ్యతిరేకించి మొదటి పార్టీ సీపీఐ(ఎం)” అని సీతారాం ఏచూరి గుర్తు చేశారు. ఈ సమస్యలన్నింటిలో, అనేక ఇతర విషయాలలో కాషాయ పార్టీని వ్యతిరేకించటంలో సీపీఐ(ఎం) ముందున్నదనీ, ఇన్ని సందర్భాల్లో బీజేపీని వ్యతిరేకించలేదని మాపై ఆరోపణలు చేసేవారు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.
సీపీఐ(ఎం) వటకర లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కె.కె శైలజపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ ప్రకటన చేశారు. ఆమెపై జరుగుతున్న ప్రచారాన్ని ‘తీవ్రమైన, అసభ్యకరమైనది’గా ఆయన అన్నారు. ఇది ఆమె ఎన్నికల్లో విజయం సాధించినట్టు సూచిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరినందున ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏచూరి కోరారు. వ్యక్తిగత దాడులతో కాకుండా వాస్తవాలు, సారాంశాల ఆధారంగా మాట్లాడదామని ఆయన అన్నారు. ప్రచార సమయంలో అందరూ గౌరవాన్ని, మర్యాదను కొనసాగించాల్సిన అవసరమున్నదని ఏచూరీ చెప్పారు.శైలజపై సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజపై సైబర్ దాడి వటకర కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పారంబిల్‌కు తెలిసే జరుగుతున్నదని ఆరోపిస్తూ ఆయనపై సీపీఐ(ఎం) ఈసీకి ఫిర్యాదు చేసింది. కాగా, యూడీఎఫ్ కార్యకర్తలు శైలజపై దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. కేరళలో షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.