రైతులపై మోడీ దమన కాండ

– కాల్పులు దుర్మార్గం :పీఓడబ్ల్యూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తే మోడీ సర్కార్‌ రైతులపై దమనకాండకు దిగి కాల్పులు జరిపిందని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ ఝాన్సీ, అందె మంగ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. . ఇది అత్యంత దుర్మార్గ చర్యని పేర్కొన్నారు. గతేడాది చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమం అనంతరం కార్పొరేట్‌ చట్టాలను వెనక్కి తీసుకునే హామీతో పాటు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీని నెరవేర్చాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతాంగంపై రబ్బర్‌ బుల్లెట్లతో కాల్పులు జరపటంతో 23 ఏండ్ల శుభకరన్‌ సింగ్‌ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురికి గాయాలయ్యా యని తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొ న్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులపై దేశ ద్రోహులపై దాడి చేసినట్టు గా కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.