-పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం వివాదాస్పదం
-సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు ఈడి, ఐటి అధికారుల చేత దాడులు చేయిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హుస్నాబాద్ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారిందని, బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ మోడీ పట్టించుకోలేదన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్ ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికి అనేక పధకాలను ప్రకటిస్తూ గద్దెనెక్కి హామీలు మరిచాడన్నారు. కెసిఆర్ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు , నిరుద్యోగ భృతి, పెన్షన్, సంక్షేమ పధకాలను అమలు చేసేంతవరకు సిపిఐ ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, గడిపె మల్లేశ్, ఎడల వనేష్, జాగీర్ సత్యనారాయణ, బద్దిపడగ రాజారెడ్డి, సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, కొహెడ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.