మోడీ భక్తి ఢిల్లీ పీఠంపైనే..

మోడీ భక్తి ఢిల్లీ పీఠంపైనే..– అదానీ,అంబానీ లాభాలు తప్ప ప్రజల కష్టాలు పట్టవు
– కమ్యూనిస్టులు మాట ఇస్తే తప్పరు : మంత్రి కొండా సురేఖ
– బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్ధాల పుట్టలు :చుక్క రాములు
– ఇండియా కూటమి అభ్యర్థి గెలుపు కోరుతూ సీపీఐ(ఎం) సమావేశం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
నరేంద్ర మోడీ భక్తంతా ఢిల్లీ పీఠంపైనే తప్ప దేవుడు, మతంపైన కాదని, ఆయనకు అదానీ, అంబానీల లాభాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టవని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా సీపీఐ(ఎం) విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు మాట ఇస్తే తప్పరని, దేశంలో బీజేపీని ఓడించే కర్తవ్యంలో భాగంగా మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయని అన్నారు. ప్రయివేటీ కరణను పెంచి పోషిస్తున్న మోడీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువులు, వైద్యం గురించి పట్టదని విమర్శించారు. కేవలం అదానీ, అంబానీలకు ఏం కావాలో..? ఎలా లాభాలు చూపించాలి అనేది మాత్రమే చూసుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సమానత్వం కోరుకుంటుందని, బీజేపీ మాత్రం ఒక వర్గం వైపే ఉంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ బతుకుల్ని బుగ్గిపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. పోరాట తెగువ కల్గిన కమ్యూనిస్లులు అండగా ఉండటం సంతోషంగా ఉందని, కలిసికట్టుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. బీసీ బిడ్డ నీలం మధును ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపితే మంత్రిగా తిరిగొస్తాడని అన్నారు.
కార్మికుల గొంతుకనవుతా.. : ఎంపీ అభ్యర్థి నీలం మధు
హమాలీ కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన తనను మెదక్‌ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో కార్మికుల గొంతుకనవుతానని, లేబర్‌కోడ్‌లను పూర్తిగా రద్దు చేసి కార్మిక న్యాయం కోసం పాటుపడతానని కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు అన్నారు. టీఎస్‌ఐఐసీ చైర్మెన్‌ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోడీ చేసిన అబివృద్ధి చెప్పకుండా దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నాడని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలంటే నీలం మధును గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె.మళ్లికార్జున్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు జి.జయరాజ్‌, ఎ.మల్లేశం, ఆముదాల మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకలు పులిమామిడి రాజు, సీపీఐ(ఎం) నాయకులు బి.మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, వాజీద్‌ అలీ, ఎం.యాదగిరి, ప్రవీణ, గోపాలస్వామి, నర్సమ్మ, శశిధర్‌, ఎల్లయ్య, మల్లేశం, బసవరాజ్‌ పాల్గొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్ధాల పుట్ట : చుక్క రాములు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పచ్చి అబద్ధాల పుట్టలు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. దేశం ప్రపంచంలో ఐదో స్థానానికి ఎదిగిందని బీజేపీ గొప్పలు చెబుతోందని, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను గుప్పెడు మంది కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి బీజేపీని చిత్తుగా ఓడించాల్సిన కర్తవ్యం కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, సామాజిక తరగతులపై ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ కుల గణనకు ముందుకు రావడాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తుందన్నారు. మల్లన్న సాగర్‌ పోరాటంలో రైతుల పక్షాన పోరాడిన తమ పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టించిన మాజీ కలెక్టర్‌, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి రైతులు ఓటుతో తమ శక్తేంటో చాటే అవకాశం వచ్చిందన్నారు. నీలం మధు గెలుపు కోసం సీపీఎం శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.