– బ్యాకింగ్ వ్యవస్థ బలపడిందట..మొండి బకాయిలు తగ్గాయని ప్రధాని బుకాయింపు
– భిన్నంగా వాస్తవ చిత్రం
ఉపాధి మేళాలో నియామక పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టవంతంగా ఉన్నదో వివరించారు. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో ఆ వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలను ఎత్తిచూపారు. తన హయాంలో పరిస్థితి మారిందని, ఇప్పుడు చాలా మెరుగుదల కన్పించిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉన్న దేశాల సరసన మన దేశం కూడా చేరిందని గొప్పలు చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వరంగ బ్యాంకులు నిట్టనిలువున మునిగిపోతున్నాయి.
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే పేరుతో మోడీ ప్రభుత్వం కొత్త దారులు వెతికిందన్న మాట మాత్రం వాస్తవం. ముఖ్యంగా మొండి బాకీలు తగ్గాయని చెప్పుకోవడానికి పారు బకాయిలను మాఫీ చేయడం మొదలు పెట్టారు. రిజర్వ్‌బ్యాంక్ సమాచారం ప్రకారమే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.09 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. గత తొమ్మిది సంవత్సరాలలో మొత్తం రూ.13.50 లక్షల కోట్ల రుణాలు రద్దయ్యాయి. బాకీలు వసూలయ్యే అవకాశాలు లేనప్పుడే బ్యాంకులు వాటిని మాఫీ చేస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మరో మార్పు ఏమంటే బ్యాంకులు అందించే ప్రతి సేవకూ రుసుము వసూలు చేయడం. సొమ్మును డిపాజిట్ చేయడం నుంచి విత్‌డ్రా చేసుకోవడం వరకూ అన్ని లావాదేవీల పైనా ఛార్జీలు వడ్డిస్తున్నారు. వీటి ద్వారా వినియోగదారుల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఖాతాలో కనీస మొత్తం ఉంచని వినియోగదారుల నుండి కూడా కోట్లాది రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
2023 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.2.09 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాయి. దీంతో గత ఐదు సంవత్సరాలలో బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.10.57 లక్షల కోట్లకు చేరిందని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రిజర్వ్‌బ్యాంక్ సమాధానం చెప్పింది. రుణ మాఫీల కారణంగా మొండి బాకీల మొత్తం గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాదు…రుణాల ఎగవేతదారుల సంఖ్యా తగ్గింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల పారు బకాయిలు రూ.10.21 లక్షల కోట్లు ఉంటే ఈ సంవత్సరం మార్చి నాటికి అవి రూ.5.55 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. మొండి బాకీల రద్దే దీనికి కారణం. రిజర్వ్‌బ్యాంక్ సమాచారం ప్రకారం 2012-13 ఆర్థిక సంవత్సరం నుండి బ్యాంకులు రద్దు చేసిన పారు బకాయిల మొత్తం అక్షరాలా రూ.15,31,453 కోట్లు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే బకాయిలను రద్దు చేసినప్పటికీ బ్యాంక్ పుస్తకాలలో మాత్రం వాటిని ‘ఇప్పటికీ వసూలు కాని రుణాలు’గానే చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలలో బ్యాంకులు రూ.5,86,891 కోట్ల రుణాలు మాఫీ చేయగా వాటిలో వసూలైంది కేవలం రూ.1,09,186 కోట్లు మాత్రమే. దీనర్థం రద్దు చేసిన రుణాలలో బ్యాంకులు కేవలం 18.60% మాత్రమే వసూలు చేయగలిగాయి. రద్దు చేసిన వాటితో కలిపి గత మూడు సంవత్సరాలలో బ్యాంకులకు ఎగవేసిన రుణాలు రూ.10.32 లక్షల కోట్లు. 2021 మార్చిలో బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ.2,02,781 కోట్లు ఉండగా అవి 2022 మార్చి నాటికి రూ.1,74,966 కోట్లకు తగ్గాయి. అయితే 2023 మార్చి నాటికి అవి రూ.2,09,144 కోట్లకు పెరిగాయి. బ్యాంకులు తమ పుస్తకాలలో పారు బకాయిలను తగ్గించుకునేందుకు ఎగవేతదారుల రుణాలను రద్దు చేస్తున్నాయి. రద్దు చేసిన రుణాలలో బ్యాంకులు వసూలు చేసినది చాలా తక్కువ. 2020-21లో రూ.30,104 కోట్లు, 2021-22లో రూ.33,534 కోట్లు, 2022-23లో రూ.45,548 కోట్లు మాత్రమే వసూలు చేశాయి.
ఏదైనా బ్యాంక్ రుణాన్ని రద్దు చేస్తే ఆ మొత్తం బ్యాంక్ ఆస్తుల పుస్తకం నుండి కనుమరుగవుతుంది. బ్యాంక్ నుండి రుణం తీసుకున్న వ్యక్తి దానిని తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు లేదా రుణ వసూలుకు చాలా తక్కువ అవకాశం ఉన్నప్పుడు రుణాలు రద్దవుతాయి. రుణాలు రద్దు చేసిన తర్వాత కూడా వాటిని వసూలు చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాయి. ఇందుకోసం అనేక మార్గాలు అవలంబిస్తాయి. రుణంలో అసలు లేదా వడ్డీని 90 రోజులలో చెల్లించలేకపోతే అది పారు బకాయి అవుతుంది. సంవత్సరాలుగా రుణాలను మాఫీ చేస్తున్నప్పటికీ ఎగవేతదారుల పేర్లను బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంక్ కానీ వెల్లడించడం లేదు. ఎస్‌బీఐకి సంబంధించి 2022-23లో రుణాల రద్దు కారణంగా పారు బకాయిలు రూ.24,061 కోట్లు తగ్గాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.16,578 కోట్లు, యూనియన్ బ్యాంక్‌లో రూ.19,175 కోట్లు, సెంట్రల్ బ్యాంక్‌లో రూ.10,258 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.17,998 కోట్ల మేర పారు బకాయిలు తగ్గాయి.
బ్యాలన్స్ షీట్‌ను ఎప్పటికప్పుడు ‘క్లీన్’గా ఉంచడం కోసం బ్యాంకులు పారు బకాయిలను రద్దు చేస్తూనే ఉంటాయి. ఒకవేళ రద్దు చేసిన పారు బకాయిలు వసూలైతే ఆ మొత్తాన్ని మళ్లీ లాభనష్టాల ఖాతాలో చేరుస్తారు. ఆర్‌బీఐ సమాచారం ప్రకారం గడచిన మూడు సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3,66,380 కోట్ల రుణాలను అంటే 62.45% రుణాలను రద్దు చేశాయి. రుణాల వసూలు ప్రక్రియకు చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి రుణాలనే రద్దు చేస్తారు. వీరి కార్యకలాపాలలో ఎలాంటి పారదర్శకత, విధానము ఉండవు.