– వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యకు సీపీఐ(ఎం) మద్దతు : సీపీఐ(ఎం) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో.. కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
– హాజరైన కడియం శ్రీహరి, కావ్య
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మోడీయే గ్యారంటీ అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2 వేల మంది ముస్లీం మైనార్టీలను ఊచకోత కోసిన మాదిరిగా వారిపై దాడులు చేయడానికి మోడీ గ్యారంటీ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. మంగళవారం హన్మకొండ పట్టణంలోని డీ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ(ఎం) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు నాగయ్య హాజరై మాట్లాడారు. దేశంలో మతోన్మాద పార్టీ బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంగా తమ పార్టీ ఇండియా కూటమిలో చేరిందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ(ఎం) భేషరతుగా మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. పదేండ్లు దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతులుండవని, భారత దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది ప్రధాని మోడీనని అన్నారు. ఈడీ, సీబీఐ.. లాంటి స్వతంత్ర సంస్థలను ఉపయోగించి ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలు కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ను మోడీ జైల్లో పెట్టారని తెలిపారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఉచ్చులో బిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
పేదల గుడిసెలను కాపాడే బాధ్యత నాదే : కడియం శ్రీహరి
ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కాపాడే బాధ్యత తనదేనని, పేద వర్గం నుంచి వచ్చిన బిడ్డగా, వామపక్షాల పక్షపాతిగా సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి పట్టాలిప్పిస్తానని కాంగ్రెస్ నాయకులు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీనిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, అవి బలంగా ఉండాలంటే వామపక్షాలు బలంగా ఉండాలన్నారు. లేదంటే నియంత పాలన వస్తదని తెలిపారు. 25-30 ఏండ్ల్ల క్రితం ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నానని, నాడు ఐక్య ఉద్యమాలు చేశామని, సీపీఐ(ఎం) నాయకులు వెంకటయ్య, జి. నాగయ్య, సీపీఐ నాయకులు భగవాన్‌దాస్, కాళిదాస్ వంటి నేతలతో కలిసి ఐక్యంగా పోరాటాలు చేశామని గుర్తుచేశారు. హయ గ్రీవాచారి భూములు పేదలకు పంచాలని పోరాడా మన్నారు. ఐక్య ఉద్యమాల వల్లనే ప్రజా సమస్యలపౖౖె తనకు అవగాహన వచ్చిందన్నారు. నాగయ్య, తాను కలిసి 3 వేల మందికి పట్టాలిప్పించామన్నారు. జన గామ నెల్లుట్ల వద్ద సీపీఐ(ఎం) నాయకత్వంలో వెయ్యి గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించడానికి తీవ్ర మైన ప్రయత్నం జరిగిందని, నాడు గుడిసెలు తొల గిస్తే బాగుండదని జనగామ కలెక్టర్‌కు తానే చెప్పానని తెలిపారు. కమ్యూనిస్టులు క్రమశిక్షణ కలిగిన వారని, ఊరూరు తిరిగి నా బిడ్డ కావ్యను గెలిపిం చాలని కోరారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, నిజాయితీగా పనిచేశాన న్నారు. అదే నిజా యితీతో నా బిడ్డ పనిచేస్తుందని మాట ఇస్తున్నానన్నారు.
అందరికీ పట్టాలిప్పిస్తా : డాక్టర్ కడియం కావ్య
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న మీ అందరికీ పట్టాలిప్పిస్తానని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు. తాను ఈ రోజు ఈస్థాయికి ఎదిగానంటే అందుకు తన తండ్రితో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చలవేనన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి భూములు కనిపించినా, గుట్టలు కనిపించినా మింగేస్తాడన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల కార్యదర్శులు సిహెచ్.రంగయ్య, బొట్ల చక్రపాణి, మోకు కనకారెడ్డి, బందు సాయిలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేశ్, నాయకులు వాసుదేవరెడ్డి, నలింటి రత్నమాల, టి ఉప్పలయ్య, ముక్కెర రామస్వామి, గుమ్మడిరాజుల రాములు, వాంకుడోతు వీరన్న పాల్గొన్నారు.