జనవరి 22న అయోధ్యలో రాములల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం దేశ ప్రధానిగా ఉన్న మోడీ చేతుల మీదుగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయటంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులే కాకుండా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వాధి నేతలు మోడీ అనుకూల మీడియా టైకూన్లు ‘యమ’ పోటీపడ్డారు. స్వాతంత్య్రం తరువాత మనం రాసుకొని, మనం మనకే అంకితమిచ్చుకున్న రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అన్న పదమే లేనట్టుగా వీరు ప్రవర్తించారు. 1947 ఆగస్టు 15 ఎర్రకోటపై జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఎగరేసిన రోజుతో సమానంగా ఈ కాషాయ జెండా కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటి మీద కాషాయ జెండాలు ఎగురవేయమన్నారు. ప్రతి గుడిలోను పూజలు చేయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు, స్కూళ్లు కాలేజీలకు రోజు సగం సెలవు, పూర్తి సెలవు ప్రకటించారు. ఊరూరా రాముడి శోభాయాత్ర ఊరేగింపులు నిర్వహించారు.
నాగ్‌పూర్ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవెయ్యరు అనే విమర్శకు సమాధానంగా ఇకముందు దేశంలో మేమున్నంతకాలం ఎగరబోయేది కాషాయ జెండానే అని ఈ కార్యక్రమాలు సూచిస్తున్నట్టుగా లేదూ? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, కలిసిమెలసి జీవిస్తున్న ఈ భారతదేశంలో ఇటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనటం కోసం ప్రధాని ఉపవాస దీక్ష చేపట్టటం, గుళ్లు గోపురాలు సందర్శించడం, ఆలయాల పరిసరాలు శుభ్రం చేయటం – ఇవన్నీ దానికి సూచనలే కదా. ప్రభుత్వం ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న ఈ మత కార్యక్రమాన్ని వామపక్షాలతో పాటు అనేక ప్రతిపక్ష నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. అంటే వీరెవరికి దేశంలో మతసామరస్యం అక్కరలేదా అనే సందేహం చాలామందికి కలిగింది. వారంతా ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశంలో ఎటువంటి మతకల్లోలాలు జరగవనే ఆశలో ఉన్నారు.
ప్రాణప్రతిష్ట తర్వాత జరిగిన ప్రసంగంలో మోడీ చెప్పింది ఏమిటి? రామ మందిరం శాంతికి, సహనానికి, సామరస్యానికి, సమన్వయానికి చిహ్నం అని కదా చెప్పింది. రాముడు వివాదం కాదు సమాధానం అని కూడా అన్నారు. ప్రజలలో ఆశలు ఏర్పడడానికి మోడీ ప్రసంగం ఒక కారణం. కొన్ని మీడియా సంస్థలు అయితే ఏకంగా రామరాజ్యమే ప్రతిస్థాపనమైనట్టు ప్రకటించాయి. బాబ్రీ మసీదు వివాదంపై కోర్టు తీర్పు సహేతుకంగా లేదని న్యాయనిపుణులు విమర్శించినా, రామ మందిర నిర్మాణంతో ఈ వివాదం ముగిసినట్టేనని, ప్రజల మధ్య మళ్లీ శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని అన్ని మతాలవారు, దేశ ప్రజలు ఆశించారు. తీర్పు కూడా అటువంటి భావననే కలిగించింది.కానీ జరిగిందేమిటి?
మోడీ తన ప్రసంగంలో ఏమి చెప్పినా, ప్రతిష్ట అనంతరం జరుగుతున్న సంఘటనలు ఇంతకు మునుపు జరిగిన వాటికి కొనసాగింపుగానే ఉన్నాయి.ప్రాణ ప్రతిష్టకు ముందు రోజు అనేక చోట్ల హిందూత్వ సంస్థలు ఊరేగింపులు తీశాయి. కొన్ని ప్రాంతాలలో మసీదుల మీద బలవంతంగా కాషాయ జెండాలు ఎగరవేశారు. హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో ఆనంద పట్వర్ధన్ ‘ రామ్ కె నామ్’ డాక్యుమెంటరీని సినీఫిలిస్ వారు ప్రదర్శించారు. ఆ ప్రదర్శన సగం కూడా కాకుండానే హిందుత్వ మూకలు ఆ రెస్టారెంట్లోకి చొరబడి, తెరను చించేశాయి. ప్రదర్శించటానికి వీలులేదని నిర్వాహకులతో ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ప్రదర్శన నిర్వాహకులను నలుగురిని అరెస్ట్ చేశారు. అల్లరి మూకను మాత్రం వదిలేశారు. నిషేధించబడని డాక్యుమెంటరీని ప్రదర్శించడం కూడా తప్పు అయిపోయింది. అరెస్ట్ అయిన నిర్వహకులు తమ లాయర్లను కలవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు.
మరో పెద్ద సంఘటన ముంబై శివారులోని మీరా రోడ్‌లో జరిగింది. ప్రాణ ప్రతిష్ట ముందు రోజున హిందూ మూకలు తీసిన ఊరేగింపుపై దాడి జరిగిందనే నెపంతో ముస్లింలపై, వారి దుకాణాలపై దాడి జరిగింది. ఇది జనవరి 21 నుంచి 25 దాకా సాగింది. హిందువులు, ముస్లింలు పరస్పరం కేసులు పెట్టుకొన్నారు. హిందూత్వ వాదులు పెట్టిన కేసులపై ముస్లింలను అరెస్ట్ చేశారు కానీ, ముస్లింలు పెట్టిన కేసుల్లో పోలీసులు ఎటువంటి అరెస్టులు లేవు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముస్లింల పేరుతో ఉన్న షాపులపై బుల్డోజర్ నడిపారు. దుకాణాల నేమ్ బోర్డులను తొలగించారు. మీరా రోడ్‌లో జరిగిన సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లోనే బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తనకు అనుకూలంగా వుండే విలేకర్లతో పత్రికా సమావేశం నిర్వహించారంటే పోలీసుల వైఖరేమిటో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే అన్నది మర్చిపోకూడదు.
మీరా రోడ్డు ఘటనను మించిన మరొక సంఘటన ‘డబుల్ ఇంజిన్’ ఏలుబడిలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలో ఫిబ్రవరి 8న జరిగింది. అక్రమంగా ఆక్రమించిన స్థలంలో మసీదు, మదరస కట్టారనే ఆరోపణపై వాటిని కూల్చడానికి బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు వచ్చారు. మసీదు, మదరసా కట్టిన స్థలం వివాదం అప్పటికే కోర్టు పరిధిలో ఉంది. అయినా కూల్చడానికే అధికారులు సిద్ధమయ్యారు. ముస్లిం ప్రజానీకం తిరగబడ్డారు. పోలీసులు ఇండ్లల్లోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా అందర్నీ కొట్టారు. ఘర్షణలో ఆరుగురు ముస్లింలు చనిపోయారు. దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో కూల్చివేతలయితే ఆగినాయిగానీ, ఈ దాడికి భయపడి అనేక కుటుంబాలు ఇండ్లు విడిచిపోయాయి.’ఉత్తరాఖండ్ దేవ భూమి అని, ఇక్కడ ఇతర మతస్థులకు చోటు లేదని’ సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడం కూడా ఇతర మతస్తుల ఉనికిని ప్రమాదంలో పడేసింది.
ఈ సంఘటనలే కాదు ఇటువంటి అనేకం ప్రతిరోజు జరుగుతున్నట్లు పేపర్లు వార్తలు ఇస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వస్తే, జైపూర్‌లోని హవా మహల్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుంద్ ఆచార్య అనే స్వామి వారు జైపూర్ వీధుల్లో ముస్లిం దుకాణాలన్నీ మూసివేయాలని హుకుం జారీ చేశాడు. పైగా ఇది కరాచీ కాదు, మాకు ఇష్టమైన కాశీ అని కూడా అన్నాడు. క్షత్రియుడైన రాముడు మాంసం తిన్నాడో లేదో అనేది వేరే విషయంగానీ, రామరాజ్యంలో ప్రజలు మాంసం తినకుండా ఉన్నారా? మోదీ తెచ్చిన రామరాజ్యంలో మాంసాహారం నిషేధం. హిజాబ్ ధరించినందుకు కర్నాటకలో ముస్లిం విద్యార్థినులను వేధించినట్టుగానే, రాజస్థాన్ బిజెపి ప్రభుత్వం కూడా ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కూడదనే నిబంధన పెట్టాలని భావిస్తున్నట్టు పత్రికలు రాశాయి.త్రిపురలో ఒక క్రైస్తవ మైనారిటీ పాఠశాలయిన డాన్ బాస్కో స్కూల్లో సరస్వతీ పూజ చేయాలని హిందూ జాగరణ మంచ్ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పై ఒత్తిడి తెచ్చింది. గత్యంతరం లేక ఆ స్కూల్ ప్రిన్సిపాల్ హిందూ మూకల నుంచి రక్షణకోసం పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. మోడీ ప్రచారం చేసుకునే ‘డబులింజన్’ ప్రభుత్వాలే.
ఇటువంటి సంఘటనలు రోజూ వార్తాపత్రికలలో దర్శనమిస్తూనే ఉన్నాయి. పరిశీలనగా చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇటువంటి మతపరమైన దాడులు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాదు ఈ దాడులు, వేధింపులలో రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన మద్దతు ఉండటం మరింత విషాదం కలిగిస్తుంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు తక్కువగా జరగడమే గాక, హిందుత్వం మూకలను కట్టడి చేయడానికి ఆ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పార్లమెంట్ లోపలా, బయట బహిరంగ సభలోనూ ‘మోడీ గ్యారంటీ’ గురించి మోడీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో జరుగుతున్న ఘటనలు పరిణామాలు చూస్తుంటే మోదీ గ్యారంటీ అంటే, మైనార్టీల ప్రాణాలు, ఆస్తులు, బతుకుదెరువులపై దాడులు, వేధింపులు తప్ప మరొకటి కాదు, రామరాజ్యం అసలే కాదు. ఇటువంటి భారతదేశాన్ని మనం కోరుకుందామా? రాజకీయాలను, మతాలను వేరుగా వుంచే భారతదేశాన్ని కోరుకుందామా?
– కర్లపాలెం భాస్కర్‌రావు 9676457732