మోడీ గ్యారెంటీ ఒక ‘జుమ్లా’

మోడీ గ్యారెంటీ ఒక 'జుమ్లా'– భారత్‌లో అసలైన సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం
– అందుకే ఇజ్రాయెల్‌కు వెళ్లటానికి సాహసిస్తున్న యువత
– కేంద్రంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌లో ఉపాధి కోసం భారత యువతను అక్కడకు తరలించే చర్యపై కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీరును తప్పుబట్టారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, మోడీ గ్యారెంటీ అని చెప్పే మాటలు కేవలం ఒక ‘జుమ్లా(అబద్ధపు హామీ)’గా ఆమె అభివర్ణించారు. భారత్‌ ఎదుర్కొంటున్న అసలైన సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణమనీ, దీనికి బీజేపీ సర్కారు వద్ద పరిష్కారం లేదని ప్రియాంక అన్నారు. ఇజ్రాయెల్‌ దేశంలో పని కోసం కార్మికులను పంపటానికి నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ప్రజలు క్యూలో నిలబడిన ఒక వీడియోను ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్‌ చేశారు.
” ఒకవేళ ఎక్కడైనా యుద్ధం అనేది జరిగితే.. తొలుత మనం అక్కడున్న మన పౌరులను రక్షించుకుంటాం. తర్వాత వారిని మన దేశానికి తీసుకొస్తాం. అయితే, యుద్ధవాతావరణంలో ఉన్న ఇజ్రాయెల్‌కు వెళ్లటానికి సాహసిస్తున్న వేలాది మంది యువతను ప్రభుత్వం కనీసం రక్షించటంలేదు. ఇది నేటి నిరుద్యోగ ఫలితమే” అని ప్రియాంక ‘ఎక్స్‌’ పోస్ట్‌లో హిందీలో రాసుకొచ్చారు. ‘ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’, ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు’, ‘మోడీ గారి గ్యారెంటీ’ అంటూ ఎన్నికల సమయంలో చెప్పే మాటలు కేవలం జుమ్లా అని ఆమె పేర్కొన్నారు. యువతకు వారి దేశంలో ఉద్యోగాలు రావటం లేదని ప్రశ్నించారు. ” యుద్ధవాతావరణంలో ఉన్న ఇజ్రాయెల్‌కు యువతను పంపించటానికి భారత ప్రభుత్వం దేని ఆధారంగా అనుమతులు జారీ చేసింది? మన యువత జీవితాన్ని రక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని ప్రియాంక ప్రశ్నించారు. భారత యువత ఇదంతా అర్థం చేసుకుంటున్నదని వివరించారు.