భారత్‌ను విశ్వగురువు చేయడమే మోడీ గ్యారంటీ

To make India a global leader Modi's guarantee– తెలుగులో బీజేపీ మ్యానిఫెస్టో ఆవిష్కరణలో కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ అధికారంలోకి రాగానే భారత్‌ను మళ్లీ విశ్వగురువును చేస్తామనీ, అదే మోడీ గ్యారంటీ అంటూ కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగులో రూపొందించిన బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నట్టు తెలిపారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోడీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఇల్లు అందించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. పేదలకు ఇండ్లు, స్వచ్ఛమైన తాగునీటితోపాటుగా సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ కింద ‘జీరో కరెంట్‌ బిల్‌’ అందిస్తామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, జన ఔషధి కేంద్రాలు, ఆరోగ్య మందిరాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మూడుకోట్ల మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. పేపర్‌ లీక్‌లను అరికట్టే విషయంలో కఠినమైన చట్టాలను తీసుకొస్తామన్నారు. వయోవద్ధులకు నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించుకున్న ఆటో, టాక్సీ, ట్రక్‌ డ్రైవర్లు, ఓలా, ఊబర్‌ రైడర్లు వంటి వారికి లబ్ధి చేకూర్చడంతోపాటుగా అర్హత కలిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేస్తామని వివరించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల జీవన ప్రమాణాలను పెంచుతామన్నారు. రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్‌ ప్రకారం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌) అమలు చేస్తామన్నారు. జమిలీ ఎన్నికలను సాకారం చేసే దిశగా అడుగులేస్తామని ఆయన హామీ ఇచ్చారు.