నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నికల్లో ఢకొీనలేక ప్రధాని మోడీ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన మోడీని గద్దె దించి దేశాన్ని రక్షించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. రాయబరేలీ, అమేథీల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందనీ, దేశంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రాజీవ్ గాంధీ 33వ వర్థంతి కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రధానికి నివాళులు అర్పించాలని వీహెచ్ కోరారు.
హరీశ్‌రావుకు మతిభ్రమించింది :భవానీ రెడ్డి
వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగూడెంలో రైతులకు బేడీలు వేసింది ఎవరనేది ప్రజలకు తెలుసన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్‌దైతే, ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తున్నదని చెప్పారు. ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనీ, ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పట్టభద్రులకు అండగా తీన్మార్ మల్లన్న :లింగం యాదవ్
గడీల పాలనకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు అండగా పోరాడిన తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్న గెలిస్తే పట్టభద్రులకు అండగా ఉంటారని తెలిపారు. పదేండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వని కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.