మోడీ మతతత్వం..అవకాశవాద రాజకీయం!

Modi's religiosity..Opportunistic politics!వరుసగా నరేంద్రమోడీపై వీడియోలు తీస్తున్న ధ్రృవ్‌ రాఠీ ఒక తాజా వీడియోలో మోడీ గురించి వివరించారు. ఈ వివరణ ఆసక్తికరంగా ఉంది. గుజరాత్‌ వడ్‌నగర్‌లోని భగవతాచార్య నారాయణ చార్య హైస్కూల్లో నరేంద్ర మోడీ చదువుకున్నారు. ఆయన ఒక యావరేజి స్టూడెంట్‌ అని సంస్కృతం టీచర్‌ ప్రహ్లాద్‌ పటేల్‌ చెప్పారు. ఎనిమిదేండ్ల వయసులోనే ఆరెస్సెస్‌తో పరిచయమయ్యింది. 1958లో వడ్‌నగర్‌లోని ఆరెస్సెస్‌ శాఖలో బాల్‌ స్వయం సేవక్‌గా చేరారు. 1972లో 22 సంవత్సరాల వయసులో మోడీ ఆరెస్సెస్‌ ప్రచారక్‌ అయ్యారు. 15 ఏండ్ల తర్వాత 1987లో ఆయన బీజేపీలోకి వచ్చారు. 1995లో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2001లో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మరుసటి సంవత్సరమే 2022లో గుజరాత్‌ మారణహోమం జరిగింది.ఈ మతతత్వ అల్లర్లు జరిగినప్పుడు మోడీపై అనేక ఆరోపణలు వచ్చాయి. మోడీకి క్లీన్‌ చీట్‌ కూడా తర్వాత దొరికిపోయింది. మోడీ ముస్లింలకు గుణపాఠం నేర్పిన నాయకుడిగా చాలామంది చూస్తారు. హిందూ హృదయ సామ్రాట్‌ అంటారు చాలామంది. మరోవైపు మోడీ సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అంటారు. మోడీ తన ప్రసంగాల్లో మటన్‌, మచిలీ అంటూ చాలా గగ్గోలు చేశారు.
కానీ మరోవైపు గొడ్డు మాంసం ఎగుమతి చేసే కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయల ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళం తీసుకున్నారు. గంగానది ప్రక్షాళన కోసం జీవితాంతం పోరాడిన స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ సనంద్‌ ప్రధాని మోడీకి మూడు లేఖలు రాశారు. ఈ లేఖలు ప్రధాని కార్యాలయానికి చేరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ సనంద్‌ 111 రోజుల నిరాహార దీక్ష తర్వాత మరణించారు. అప్పుడు కూడా మోడీ పెదవి విప్పలేదు అది కూడా ట్విట్టర్‌ ద్వారా తన సంతాపం ప్రకటించారు. మోడీ హిందువైనా ఒక హిందూ సంత్‌ ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎంతోమంది హిందువులు ఉన్నారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ప్రజ్వల్‌ రేవన్న రేప్‌ చేసిన వేలాది మంది మహిళల్లో ఎంతోమంది హిందువులు ఉన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లు కూడా హిందువులే. కానీ మోడీకి ఇవేమీ పట్టలేదు. ప్రజ్వల్‌ రేవన్న కోసం ఓట్లు అడిగారు. ఇప్పుడు బ్రిజ్‌ భూషణ్‌ కొడుక్కు టికెట్‌ ఇచ్చారు. ఈ విషయాలేవీ దేశంలో బ్రెయిన్‌ వాష్‌కు గురైన వాళ్ళు పట్టించుకోరు. మహిళలకు భద్రత ఉందా లేదా, పిల్లలకు విద్యా అవకాశాలు దొరుకుతున్నాయా లేదా, ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేదా ఇవేమీ వీళ్లకు పట్టవు. వీళ్ళకు కావలసింది కేవలం ముస్లింలను వేధించే నాయకుడే ముఖ్యం అని ధ్రృవ్‌ రాఠీ వివరించాడు. ఇలాంటి వాళ్ల కోసమే మోడీ హిందూ, ముస్లిం ప్రసంగాలు చేస్తారు.
అమిత్‌షా ఇలాంటి మాటలే గతేడాది చెప్పారు. 2002లో వాళ్లు అల్లర్లు చేస్తే మోడీ గుణపాఠం చెప్పారని అన్నారు. రాజస్థాన్‌లో ముస్లింలపై విషం కక్కి ఓట్లు పొందే అవకాశం చూడగానే ముస్లింలను చొరబాటుదారులు, అధిక సంతానం కలిగిన వారని అన్నారు. కానీ విచిత్రమేమిటంటే బీహార్‌లో రాజకీయ సమీకరణలు వేరు. అక్కడ హిందూ ముస్లిం చేస్తే ఓట్లు దొరకవు. అక్కడ శాంతి దూతగా మారిపోయారు. దేశాన్ని మతపరంగా ముక్కలు కానివ్వనని చెప్పారు. అలీగడ్‌ ర్యాలీలో కూడా ముస్లింల శ్రేయోభిలాషి తానే అన్నట్లు మాట్లాడారు. మే 14వ తేదీన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే తాను అస్సలు హిందూ,ముస్లిం రాజకీయాలు చేయనని, అలా రాజకీయాలు చేసిన రోజున తాను ప్రజా జీవితానికి పనికి రానట్లే లెక్క అని అన్నారు. ఇవన్నీ విన్నవాళ్ళకు చాలా అయోమయం కలగవచ్చు. మోడీ మతతత్వవాదా? లౌకికవాదా? అని. స్వయంగా బీజేపీలో ఆయన ఎదుగుదల విషయంలో కూడా మోడీ అవకాశవాద రాజకీయాలు ఇలాంటివే అని ధ్రృవ్‌ రాఠీ చెప్పారు. అనేకమంది సీనియర్‌ బీజేపీ నేతలతో మాట్లాడి కారవాన్‌ ప్రచురించిన వ్యాసంలో విషయాలను ధ్రృవ్‌ రాఠీ ప్రస్తావించారు.
ది ప్రింట్‌ 2019లో మోసమిదాస్‌ గుప్త రాసిన వ్యాసం కూడా ముఖ్యమైనది. రాజ్‌నాథ్‌ సింగ్‌ సీనియర్‌ మంత్రి అయినప్పటికీ ఆరు కేబినెట్‌ కమిటీల్లో ఆయన్ను పక్కనపెట్టారు. తర్వాత ఆయనకు కమిటీలో స్థానం కల్పించడం జరిగిందన్నది వేరే విషయం. నితిన్‌ గడ్కరీ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2021లో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ వాజ్‌పేయి, నెహ్రూలు ఆదర్శ నేతలని అన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయనను తప్పించారు. బీజేపీలో కొందరిని పక్కకు తప్పించడం మాత్రమే కాదు మోడీని పొగిడిన నేతలకు ఉన్నత స్థానాలు కూడా ప్రసాదిస్తారు. నిర్మల సీతారామన్‌ 2006లో బీజేపీలో చేరారు. కేవలం పదకొండు సంవత్సరాల కాలంలో రక్షణ మంత్రి అయ్యారు. 2019లో ఆర్థిక మంత్రి కూడా అయ్యారు. బిజినెస్‌ స్టాండర్డ్‌ 2014 వ్యాసం స్మృతి ఇరానీ బీజేపీలో ఎలా ఎదిగారో వివరించింది. 2014లో అమేఠీ ఎన్నికల్లో స్మృతి ఓడిపోయినా ఆమెను మానవ వనరుల శాఖ మంత్రిగా చేశారు. 2019లో మహిళా శిశు సంరక్షణ మంత్రి అయ్యారు. అశ్వినీ వైష్ణవ్‌ మొదట ఐఏఎస్‌ అధికారి, ఆ తర్వాత కార్పొరేటులో ఉద్యోగం చేశారు. 2019లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేవలం రెండేండ్ల కాలంలో అంటే 2021లో మూడు మంత్రిత్వ శాఖలు ఆయనకు అప్పగించారు. జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెసు ను వదిలి బీజేపీలోకి వచ్చారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. వెంటనే ఆయన్ను మంత్రిగా చేశారు. దాదాపు పాతికమంది అవినీతి నాయకులు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇందులో 23 మంది నేతలపై ఉన్న అవినీతి కేసులు రద్దయ్యాయి. ఎవరు అవినీతిపరులు, ఎవరు అసమర్థులు అనేవి అంత ముఖ్యం కాదు మోడీజీకి. ఎవరు విధేయులు వారికి ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. ఇది రివార్డ్‌ అండ్‌ పనిష్‌ మోడల్‌. ఈ మోడల్‌ ప్రతి వ్యవహారంలోనూ మోడీ అమలు చేస్తారు. ఇలా ప్రతి విషయంలో మోడీ అవకాశవాద రాజకీయాలు చేస్తూ మతతత్వంతో దేశాన్ని పాలిస్తున్నారు. మరోసారి ఆయన అధికారంలోకి వస్తే దేశంలో ఇక ఎన్నికలుండవనే నిజాన్ని గ్రహించిన ప్రజలు ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.
అబ్దుల్‌ సత్తార్‌, 7382619029