ఇజ్రాయిల్‌కు మోడీ మద్దతు దారుణం హానికర బిజెపిని వీడండి

Modi's support for Israel is outrageous
Leave the harmful BJP– వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు సీపీఐ(ఎం) పిలుపు
– ప్రజారక్షణ భేరి యాత్ర ముగింపు సభలో గఫూర్‌
గుంటూరు : పాలస్తీనా ప్రజలను ఊచకోతకోస్తున్న ఇజ్రాయిల్‌కు భారత ప్రభుత్వం మద్దతు పలకడం దారుణమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ విమర్శించారు. గత నెల 30న కర్నూలు జిల్లా ఆదోని నుంచి ప్రారంభమైన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర గుంటూరు జిల్లా ఉండవల్లిలో గురువారం ముగిసింది.ఆయా చోట్ల జరిగిన సభల్లో గఫూర్‌ మాట్లాడుతూ.. గతంలో గుజరాత్‌లో ముస్లింలను నరమేథం చేసిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఇజ్రాయిల్‌కు మద్దతు పలుకుతున్నారని అన్నారు. మానవత్వం లేని, రాక్షస ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, స్వాతంత్య్రం వచ్చాక ఎన్నడూ లేనంతగా మైనార్టీలపై ఊచకోతకు పాల్పడుతోందని విమర్శించారు. పాలస్తీనా భూ భాగం పాలస్తీనీయులదేనని మహాత్మాగాంధీ కూడా చెప్పారన్నారు. అమెరికా మద్దతుతో రెచ్చిపోతున్న ఇజ్రాయిల్‌కు మోడీ మద్దతు పలకడం దారుణమన్నారు. ఇప్పటికే పదివేల మంది పాలస్తీనియులు చనిపోయారని, వారిలో 4500 మంది పిల్లలు, మహిళలున్నారని తెలిపారు. తక్షణమే పాలస్తీనాకు భారతప్రభుత్వం సంఘీభావం తెలపాలని డిమాండ్‌ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ.. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులు, రైల్వే, బొగ్గు గనులు, విమానయానం, బీమా తదితర పరిశ్రమలను హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయిస్తే లాభాలు తెచ్చి చూపిస్తామని కార్మికులు చెబుతున్నారని, కానీ కేంద్రం మాత్రం టాటా, జిందాల్‌ వంటి కార్పొరేట్లకు గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మొండి చేయి చూపిస్తోందన్నారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం 103 మండలాలు ప్రకటించడం సరికాదన్నారు. ప్రకటించిన మండలాల్లోనూ రైతులు, వ్యవసాయ కార్మికులనూ ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు లేవన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేయడమే లక్ష్యంగా ఉన్నామని చెప్పారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రతినెల రూ. నాలుగు వేల కోట్లు అప్పు లేనిదే రాష్ట్ర మనుగడ సాగడం లేదన్నారు. ఉద్యోగులకు, మున్సిపల్‌ కార్మికులకు, పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు అందటం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుందని, బిటెక్‌, ఎంటెక్‌, ఎంబిఎ చదివిన వారుఉపాధి కోసం ఆటోలు నడుపుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు రావాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని, అందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదన్నారు.
రాష్ట్రానికి తీవ్ర హానిచేస్తున్న బీజేపీని వ్యతిరేకించవలసిందిపోయి వైసిపితో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా కేంద్రాన్ని సమర్థించడం దారుణమని అన్నారు. బీజేపీ విషకౌగిలిని వీడాలని ఆ పార్టీలకు గఫూర్‌ పిలుపునిచ్చారు.ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సిహెచ్‌ బాబూరావు, వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి, కె.ఉమామహేశ్వరరావు, దయారమాదేవి, శివనాగరాణి, భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.