న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విషయంపై మాట్లాడారు. ఉక్రెయిన్‌లో తాను జరిపిన పర్యటన వివరాలను తెలియజేశారు. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సాధించేందుకు భారత్ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. మోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సంభాషించిన విషయం తెలిసిందే.
‘ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాను. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంపై చర్చించాను. ఇటీవల నేను ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన వివరాలను తెలియజేశాను. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా, ఇరువురికీ ఆమోదయోగ్యంగా, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు భారత్ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించాను’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోడీ వివరించారు.