మోడీ పర్యటించడం సిగ్గుచేటు

– విభజన హామీలను అమలు చేయకుండా
– రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు :డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనీ, ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రావడం సిగ్గుచేటని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశాన్ని గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీలు, ఐఐటీలు, ఐఐఎం, త్రిపుల్‌ఐటీ, గిరిజన, మైనింగ్‌ విశ్వవిద్యాలయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వ కుండా మోసం చేసిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని అన్నారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నదని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేసిందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా మని హెచ్చరించారు. ఇప్పటికైనా విభజన హామీలను నెరవేర్చాలని డిమాం డ్‌ చేశారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు బషీరుద్దీన్‌, తిరుపతి, జావెద్‌, జగన్‌, కార్తీక్‌, శివవర్మ, తిరుపతి నాయక్‌, క్రిష్ణ నాయక్‌, గడ్డం వెంకటేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.