వచ్చే నెలలో ఉక్రెయిన్‌లో మోడీ పర్యటన?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 2022లో రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. సదస్సులో ఇరువురు నేతలు పరస్పరం ఆలింగనం చేసుకోవడం కూడా కన్పించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మోడీకి జెలెన్‌స్కీ ఫోన్‌ చేసి అభినందించారు. తమ దేశంలో పర్యటించాలని కోరారు. మార్చిలో జెలెన్‌స్కీకి మోడీ ఫోన్‌ చేసి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై చర్చించారు. చర్చలు, దౌత్య ప్రయత్నాల ద్వారానే రష్యాతో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మోడీ ఈ నెల ప్రారంభంలో రష్యాలో కూడా పర్యటించి దేశాధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు.