తనకు తానే తుమ్మి చిరంజీవ అనుకున్నారని సామెత. ప్రధాని నరేంద్ర మోడీ,ఆయన బీజేపీ కూటమి పరిస్థితి అలాగే వుంటుంది. తమ హయాంలో జరిగిన ప్రగతికి ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోందని, ప్రపంచం భారతదేశం వంక చూస్తున్నదని అహోరాత్రులు చెబుతూనే వుంటారు. ఇందుకు ఆధారాలు చూపుతారా అంటే అదీ వుండదు. అంతర్జాతీయ మీడియాలో విమర్శలు వస్తే వెంటనే కట్టకట్టుకుని దాడి చేస్తారు. సోషల్‌మీడియాలో మొదలై కేంద్ర మంత్రుల దాకా ఆ పవిత్ర ఖండనలో పాలు పంచుకుంటారు. ఈ ప్రహసనం పదేండ్లుగా సాగుతూనే వుంది. తాజాగా అక్టోబరు 31వ తేదీన ప్రధాని మోడీ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం తతంగంలో ఇదే చేశారు. సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తూ ఏకపక్ష వ్యాఖ్యానాలు గుప్పించారు. అసలు ఆ రోజును పటేల్‌తో ముడిపెట్టి ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించడమే పెద్ద రాజకీయం. ఎందుకంటే దీర్ఘకాలం దేశాన్ని పాలించిన ప్రధాని ఇందిరగాగాంధీ అధికార నివాసంలోనే కుట్రపూరితంగా హత్యకు గురైన రోజు అది. రాజకీయ విభేదాలు, ఎవరి తప్పొప్పులు ఎలా వున్నా దేశ చరిత్ర మారదు. అందులోనూ అత్యున్నత పదవిలో వున్న ప్రధాని హత్యకు గురైన ఘటన ఉద్వేగంతో ముడిపడివుంది. అదే రోజున సిక్కులపై వూచకోత కూడా జరిగింది. బీజేపీ వ్యూహంలో ఈ రెండో అంశాన్నే చెబుతూ ప్రధాని ఇందిర హత్యను విస్మరించే విధానం మొదలు పెట్టారు. ఎక్కడో అమెరికాలో కెనడీ హత్య గురించి దశాబ్దాల తరబడి చెప్పే బడామీడియా కూడా నాటి చరిత్రను పూర్తిగా వదిలేసింది. ఎందుకంటే ఏ ప్రముఖ పత్రికలోనూ ఛానల్లోనూ ఆమె గురించిన రాతలు లేవు. ఒక పెద్దపత్రిక సిక్కులపై హత్యాకాండ గురించి మాత్రం రాసింది. మీడియా పాలకుల చెప్పుచేతల్లో ఎంతగా చిక్కుకుపోయింది దీన్నిబట్టే తెలుస్తోంది. సర్దార్ పటేల్ నామస్మరణతో నాటి అత్యున్నత నాయకుడు నెహ్రూను మరుగుపర్చడం మోడీ వ్యూహం. అయితే పార్టీలు ఏవైనా హత్యలకు గురైన కీలక నాయకులను కూడా విస్మరించడం మొదలుపెడితే చరిత్రకే అపచారం తప్పదు.
370 రద్దు రాజ్యాంగ రక్షణా?
వర్తమానానికి వస్తే మోడీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలలో తలకిందులు తర్కం,రాజకీయ వ్యూహం దిగ్భ్రాంతి కలిగిస్తాయి. మొదటే చెప్పినట్టు దేశం అమోఘంగా పురోగమించిందని తనకు తనే కితాబులిచ్చుకోవడం ఒకటి.అంతకుమించింది రాజ్యాంగ రక్షకుడుగా తనను తాను చెప్పుకున్న తీరు.దేశంలో రాజ్యాంగ మూల సూత్రాలపైన జరుగుతున్న దాడి గురించి దేశమంతా ఆందోళన చెందుతున్నది. మొన్నటి ఎన్నికల్లో ప్రజల తీర్పులోనూ ఆ విషయం ద్యోతకమైంది. 400 సీట్ల కోతల నుంచి సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే తెచ్చు కున్న మోడీ కూడా దీన్ని గుర్తించి రాజ్యాంగ పటానికి పూజలు ప్రారంభించారు కూడా. అంతకుముందు రెండు సార్లు గెలిచినప్పుడు ఈ షో లేదే మరి? రాజ్యాంగ రక్షణ గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పదే పదే ప్రస్తావించడం, విచారణలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇవేవీ గమనించకుండా మోడీ రాజ్యాంగ గ్రంథం పట్టుకున్నారనుకుంటే పొరబాటే. కానీ ఆయన మొన్నటి ప్రసంగంలో ఆయన తీసుకున్న వాదనే వింతగా వుంది. రాజ్యాంగం పేరుతో తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ! ‘ఒకే దేశం-ఒకే పన్ను- ఒకే కార్డు’ వంటివాటిని ఏకరువు పెట్టిన తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగం వుండేలా తాము కీలక చర్యలు తీసుకున్నామని కొత్త పాట ఆలపించారు. కాశ్మీర్ 370వ అధికరణం రద్దుకు సమర్థన ఇది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు ఇవ్వడం వేరే రాజ్యాంగ మవుతుందా? ఇప్పటికీ అనేక రాష్ట్రాలకు కొన్ని విషయాల్లో ప్రత్యేక నిబంధనలున్నాయి. 370 రద్దు నిజానికి రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసిన చర్య. ఇటీవలి ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు ఆ చర్యను తిరస్కరించారు కూడా,అయినా అదే తమ విజయమైనట్టు, ఒకే రాజ్యాంగం అమలులోకి తెచ్చినట్టు చెప్పుకోవడం మోడీ గడుసుతనం తప్ప ఇసుమంత నిజం లేదు. రాజ్యాంగ మూలసూత్రాలైన లౌకికతత్వం, సమాఖ్యతత్వం,ప్రజాస్వామ్య భావప్రకటనా స్వేచ్ఛ కీలకమైనవి. ఇందులో ప్రతిదానిపైన పనిగట్టుకుని దాడి చేసిన,చేస్తున్న మోడీ అదేదో రాజ్యాంగ రక్షణగా చెప్పుకోవడం వింతల్లో వింత.
కాశ్మీర్ పరిస్థితే అన్ని రాష్ట్రాలన్నిటికీనా?
మోడీకీ గడుసుతనం ఎక్కువే గానీ ప్రజల తెలివిని మరీ తక్కువ అంచనా వేస్తే చెల్లుతుందా? ఉన్న ఒక రాజ్యాంగ స్పూర్తిని భగం చేసే మహత్కార్యంలో ఆయన 370 రద్దు తర్వాత దేశంలోని రాష్ట్రాలన్నిటికీ ఎసరు పెట్టడం యాదృచ్చికం కాదు. ఈ జాతీయ సమైక్యతా ప్రసంగంలోనే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ మంత్రోచ్చారణలో మర్మం అదే.మిగిలిన రాష్ట్రాలకూ అదే గతి పట్టిస్తానని ఆయన సందేశం, సంకేతం కూడా. ఎందుకంటే రాజ్యాంగం రెండవ అధికరణం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్య(యూనియన్ ఆఫ్ స్టేట్స్) అని నిర్వచిస్తున్నది. అమెరికాలోలాగా, ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో లాగా రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకున్నా స్వయం ప్రతిపత్తి వుండాలని రాజ్యాంగం అభిలషించింది గనకే ఇలా స్పష్టంగా పేర్కొంది. కానీ ‘ఒకే దేశం- ఒకే కార్డు-ఒకే పన్ను-ఒకే రేషన్-ఒకే మతం- ఒకే పార్టీ-ఒకే నేత’ ఇలా ఒన్ మానియా పట్టిన మోడీజీ ఒకే ఎన్నిక వుంటేనే ఒకే దేశం అంటున్నారు. ఇది అక్షరాలా ఆరెస్సెస్ తరహా కేంద్రీకృత పెత్తనాన్ని,కార్పొరేట్ తరహా ఒకే మార్కెట్ వ్యూహాన్ని కలగలపిన ఆరెస్సెస్ మాజీ ప్రచారక ప్రావీణ్యమే.
‘పంజాబసింధు, గుజరాత,మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ..’అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ పాడినప్పటికి దేశ స్వాతంత్య్రం కనుచూపుమేరలో లేదు. రాష్ట్రాలూ ఈ విధంగా లేవు. దక్షిణాది రాష్ట్రాలూ భాషలన్నింటినీ కలిపి ద్రావిడ అన్నారు. సింధ్ ప్రాంతం ఇప్పుడు ఇండియాలోనే లేదు. అయినా ఈ దేశ చరిత్రను స్వభావాన్ని ఆయన గానం చేశాడు గనక దాన్నే జాతీయగీతంగా పాడుకుంటున్నాం. విభిన్న భాషా సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశం వైవిధ్య వైభవానికి సంకేతంగా గౌరవించుకుంటున్నాం. అందులోంచి పుట్టిన స్వాతంత్య్ర పోరాట స్పూర్తి దేశాన్ని ఒక్కతాటిపై నడిపింది. ఒకే దేశం,ఒకే కారు,్డ ఒకే పరీక్ష,ఒకే పన్ను,ఒకే భాష,ఒకే మతం, ఒకే నాయకుడు వంటి నినాదాలూ, విధానాలూ ఇందుకు పూర్తి విరుద్ధమైనవి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బలవంతంగా ముందుకు తెస్తున్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పూర్తిగా రాజ్యాంగ స్పూర్తిని తోసిపుచ్చే కేంద్రీకృత పెత్తనానికి బాట వేస్తుంది. రాజ్యాంగంలో 83, 85 అధికరణాలు లోక్‌సభకు, 172,174 అధికరణాలు శాసనసభకు సంబంధించిన ఏర్పాటు ముగింపువంటి అంశాలలో దిశానిర్దేశం చేస్తున్నాయి. 356 శాసనసభల రద్దుకు ఉద్దేశించింది. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోను, ప్రజాస్వామిక చైతన్యంతోనూ ఈ నిర్దేశం చేశారు. అనుభవంలోనూ అనేక గుణపాఠాలున్నాయి. ప్రజల తీర్పుతో ప్రాతినిధ్యం పొందినవారే పాలించాలన్నది ప్రజా స్వామ్య రాజ్యాంగంలో మూలసిద్ధాంతం. రెండు సభా సమావేశాల మధ్య ఆరు నెలలకు మింగి వ్యవధి వుండ కూడదనే కీలక సూత్రంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప అయిదేళ్లు వుండాలన్న షరతు కూడా లేదు.ఆ స్పూర్తికి భంగం కలిగించే వాదనలు పైకి ఎంత ఆకర్షణగా వినిపించినా దురుద్దేశపూరితమైనవే.
ప్రజాతీర్పు లేని పెత్తనమా?
నిబంధనలు మార్చేసి ఒకే దేశం ఒకే ఎన్నికకు నిర్ణయాలు చేయడం రాజ్యాంగ మౌలిక స్పూర్తి తీర్పు కూ విరుద్ధం. వేర్వేరు సభల సమస్యల వల్ల ఇతర సభల రద్దు లేదా పొడగింపు చేస్తే దానివల్ల ఎన్నికల ఖర్చు తగ్గక పోగా పెరుగుతుంది. ఈ విధానంతో సభలను ముందుగా రద్దు చేయడం లేదా పొడగించడం కేంద్రం ఇష్టప్రకారం పాలించడానికి దారి అవుతుంది. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయాక అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ జాతీయ ప్రభుత్వం అంటూ అనేక పార్టీలతో చర్చలు జరపడం తీవ్ర విమర్శకు గురైంది. ఇక రాష్ట్రాల ఎన్నికల మధ్య తేడా రావడానికి కారణమే కేంద్రం నిరంకుశంగా ఆప్రభుత్వాలను రద్దు చేయడం లేదా ఫిరాయింపులతో కూలదోసుకోవడం. ఇలాటి ప్రతి సందర్భంలోనూ కృత్రిమంగా పొడగించడమంటే ప్రజల ఎన్నికతోనే పాలన జరగాలన్న సూత్రాన్ని మంటగలపడమే. సమాఖ్య సూత్రాలు, భాషా సాంస్కృతిక వైవిధ్యం, ప్రతిపత్తి అస్సలే దెబ్బతినిపోతాయి. మరో ముక్కలో చెప్పాలంటే కాశ్మీర్‌కు 370 రద్దుతో జరిగిందే దేశంలోని 28 రాష్ట్రాలకూ జరుగుతుందన్నమాట. నిజానికి ఒకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ముందే ఒక నిర్ణయం చేయడం, దాని అమలు పర్చే విధానాన్ని నిర్ణయించడం కోసం ఒక మాజీ రాష్ట్రపతికి ఇలా ఒక కమిటీ బాధ్యత అప్పగించడం కూడా గతంలో జరగలేదు.అయినా దీనివల్ల ఒకే రాజ్యాంగం అమలు చేస్తామంటూ ప్రధాని చెప్పుకుంటున్నారంటే ఏమనుకోవాలి?
మోహన్ భగవత్ టు మోడీ
మోడీ ఆరోపించిన మూడో అంశం దేశానికి వ్యతిరేకంగా రకరకాల శక్తులు అర్బన్ నగ్జల్స్ రూపంలో పనిచేస్తున్నారట. దీపావళికి ముందు మోడీ ఈ మాటలు చెప్పారు గానీ దసరా సందేశంలోనే ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మార్క్సిస్టులు సాంస్కృతిక రంగంలోకి చొరబడుతున్నారని హెచ్చరిం చారు. మీడియా, విద్యా సంస్థలూ, మేధావులు వారి గుప్పిట్లోనే వున్నారని వాపోయారు. హిందూమతం వల్లనే దేశం ఐక్యంగా వుందని, ఆ ప్రాతిపదికనే ఏకీకృతం చేయాలని పిలుపు నిస్తూ మార్క్సిస్టులు, వోకిజం (మేల్కొల్పు) వాదులు ఇందుకు అడ్డు తగులుతూ దేశానికి ముప్పు తెస్తున్నారని భగవత్ వ్యాఖ్యానిం చారు. ఇటీవలనే యూపీ ముఖ్యమంత్రి యోగి కూడా హిందువులు ఏకమవ్వాలని పిలుపునివ్వడం, ఇప్పుడు మోడీ మాటలు ఒకే వ్యూహంలో భాగమే. భగవత్ మార్క్సిస్టు పదం వాడితే, మోడీ అర్బన్ నగ్జల్స్ పదం తీసుకురావడంలోనూ చాలా రాజకీయం వుంది. వాస్తవానికి ఇవి రెండూ ఒకటి కాదని అందరికీ తెలుసు. అడవుల్లో నగ్జల్స్ అంతరించారు గనక పట్టణాల్లో చొరబడ్డారంటూ కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులు, కళాకారులు, రచయితల వరకూ అదే ముద్రతో చిత్రించడం వ్యూహాత్మకమే. మావోయిస్టులను ఎన్కౌంటర్లతో తుడిచిపెట్టడం సాధ్యమా? అనేది ఒకటైతే సైద్ధాంతికంగా వారితో ఏ సంబంధం లేని వారందరినీ ఆ పేరుతో చూపడం అతి తెలివి మాత్రమే. అభిప్రాయాల తేడాలేవైనా ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామిక శక్తులూ ఎప్పుడూ రాజ్యాంగ విలువల కోసం పోరాడుతూనే వుంటారు. విమర్శలూ, ఉద్యమాలు లేకుంటే ప్రజాస్వామ్యం అన్నదానికే అర్థం లేదు. రాజ్యాంగం ఇస్తున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు కాలరాచేస్తూ విమర్శించే మీడియాను, జర్నలిస్టులను వేటాడుతున్న మోడీ ‘ఒకే దేశం ఒకే రాజ్యాంగం’ నినాదాన్ని వల్లించడం హాస్యాస్పదం. స్వాతంత్య్ర యోధుడైన సర్దార్ పటేల్ 150 జయంతిని ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన భాషణకు మోడీ వినియోగించడం రాబోయే పరిణామాలకు ఒక సంకేతం.
– తెలకపల్లి రవి