సీఎం ఆదేశాలేనా..ఆచరణ ఏది..? వడ్డీ మోహన్ రెడ్డి

నవతెలంగాణ-నవీపేట్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులు ముందస్తు నాట్లు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రులు, శాస్త్రవేత్తలతో ప్రణాళిక రూపొందించి ఆదేశించిన ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారని బిజెపి బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి విమర్శించారు. మండలంలోని అలీ సాగర్ లిఫ్టు కోస్లి పంప్ హౌస్ ను శుక్రవారం నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులు ముందస్తు నార్లు వేసుకుంటే కోతలు, కొనుగోలులో ఇలాంటి ఇబ్బందులు ఉండవని ఆదేశించారని దానికి అనుగుణంగా రైతులు సైతం ముందస్తు వరి నార్లు వేసుకోగా వర్షాలు లేక ముదురుతున్నాయని, నాటిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ చేసి గోదావరిలోకి నీళ్లు వస్తాయని రైతులు భావించి నార్లు వేశారని అన్నారు. జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తడంతో సుమారు ఒక టీఎంసీ నీళ్లు గోదావరిలోకి వచ్చే అవకాశం ఉన్నందున రైతాంగాన్ని ఆదుకునేందుకు కోస్లీ పంపు వద్ద పూడిక తీసి 15 రోజుల వరకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఐడీసీ సమావేశం నిర్వహించి అలీ సాగర్, గుత్ప లిఫ్టుల ద్వారా ఎన్ని తడులు ఇస్తామో ప్రణాళిక సిద్ధం చేయాల్సిందని రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని విమర్శించారు.నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఎగువ ప్రాంతానికి మాత్రమే సాగునీటిని అందిస్తున్నారని దిగువ ప్రాంత రైతులకు నిజాంసాగర్ నీటిపై హక్కు లేదా అని ప్రశ్నించారు. కాలేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా రోహిణి కార్తెలో శ్రీ రామ్ సాగర్ నుండి బాసర వరకు బోటింగ్ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన హామీ ఎటు పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కాలేశ్వరానికి ఖర్చుపెట్టిన లక్ష కోట్లకు ఈఎంఐ, కరెంటు రూపంలో కోట్లు చెల్లిస్తున్న నిజామాబాద్ వాసులకు ఉపయోగమేమిటని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని లేకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్,ఆనంద్, మువ్వ నాగేశ్వరరావు, ఎంపిటిసి రాధా, కిషోర్, సంతోష్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, పాండు బాబు, రాజేందర్ గౌడ్, భూషణ్, రాము, మల్లెపూల గంగాధర్, భాను గౌడ్ స్థానిక రైతులు పాల్గొన్నారు.