దేశం గర్వించదగిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతను పండితుడు, రాజనీతిజ్ఞుడు. 1955లోనే భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. చేసిన సేవలకుగాను బ్రిటిష్ ప్రభుత్వం ‘నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్’ బిరుదునిచ్చి సత్కరించింది. పుట్టింది బెంగళూరులో అయినప్పటికీ వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. పుణెలో ఇంజనీరింగ్ చదివాడు. మైసూరులోని ఆనకట్ట కృష్ణరాజసాగర్‌కు ఛీప్ ఇంజనీర్‌గా పనిచేశాడు. తన 23వ యేటా బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమి షన్‌లో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను నిర్మిం చాడు.1903లో మొదటిసారిగా దీనిని పూణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. 1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్‌లోని ఆడెన్‌కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురుగు కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించాడు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా అతని పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి పూర్తివరకు అతని పర్యవేక్షణలోనే రూపు దిద్దుకుంది. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషిచేశాడు. 1917లో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజీని స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కాలేజికి అతను పేరే పెట్టారు. ఎంతో మంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15 జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుందాం.
– కామిడి సతీష్ రెడ్డి, 9848445134