అమ్మ జాగ్రత్త.. నన్ను క్షమించు..

–  ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
‘ఐ లవ్‌ యూ అమ్మ.. నువ్వు జాగ్రత్త.. నన్ను క్షమించు’ అంటూ సందేశం పంపి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరా బాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో తల్లి జయమ్మతో కలిసి నివాసముంటున్న అఖిల్‌(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాడు. అతను పబ్జీ గేమ్‌కు బాగా అలవాటు పడ్డాడు. మూడు నెలలుగా కాలేజీకి కూడా వెళ్లకుండా గేమ్‌కు బానిసయ్యాడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల్‌ స్నేహితులతో కలిసి తిరిగాడు. అనంతరం ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి బయటకు వెళ్లింది. ‘అమ్మ ఐ లవ్‌ యూ.. నువ్వు జాగ్రత్త’ అంటూ తల్లికి ఫోన్‌లో సందేశం పంపించాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి లోపలికి నుంచి డోర్‌ లాక్‌ చేసి ఉండటంతో వాచ్‌మెన్‌ సహాయంతో ఆమె తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా అఖిల్‌ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో అఖిల్‌ నాన్న చనిపోయాడు. ఇక కొడుకే సర్వస్వంగా బతుకుతున్న తల్లి ఇప్పుడు ఒంటరైంది.