అమ్మ అబద్ధం చెప్పింది

అమ్మ అబద్ధం చెప్పిందినిజం
మా అమ్మ అబద్ధం చెప్పింది
మాట్లాడుకుంటే చాలు
సమస్యలన్నీ పరిష్కారమవుతాయని
అబద్ధం చెప్పింది
అమ్మ మీద అంత నమ్మకమేమిటో
చెప్పేకొద్దీ నమ్ముతూ పెరిగాను
గడప దాటితే…
గడప దాటితే తలకిందుల ప్రపంచం ఒకటి ఉందని
అక్కడ యుద్ధాలే ప్రతిధ్వనిస్తుంటాయని చెప్పలేదెందుకో
మాటకు మంత్ర శక్తి ఉందంటుంది
ఎంత పెద్ద అబద్ధమది
మాటే పని చేస్తే
పాలస్తీనా ఎందుకు రక్తసిక్తమైంది
గాజాలో శవాల దిబ్బలు ఎందుకు పేరుకున్నాయి
వాటిమధ్య మొలుచుకొచ్చిన పసిబిడ్డల ఆర్తనాదాలు మన నరాల్లో మార్మోగుతున్నాయి
వీటిని వినిపించుకునే మంత్రం ఏమాటకుందో
మాట మదువుగా ఉండాలంటుంది
ఇప్పుడు మాటేకాదు మనసూ సున్నితమైంది
అక్కడ పేలే ఒక్కొక్క బాంబూ
ఇక్కడ మన గుండెల్లో విస్ఫోటిస్తున్నాయి
మాటకే శక్తి ఉంటే
మాటకే శక్తి ఉంటే వీధులన్నీ రక్తటేరులై పారుతాయా
ప్రాణరక్షణకై హాహాకారాలు మిన్నంటుతాయా?
పెరుగుతున్న కొద్దీ నేనూ కొన్ని నమ్ముతూ వచ్చాను
చదువు పెరిగింది టెక్నాలజీ పెరిగింది
పరిణతీ పెరుగుతుందని నమ్మాను
దేశాలమధ్యా మనుషుల మధ్య
దుఃఖరేఖలు ఏవైనా సరే అస్తమిస్తాయనుకున్నాను
ఉన్నచోటే గోడలు పుట్టుకొచ్చే రోజులివి
వమ్ముకావడానికే నమ్మకాలున్నాయని తెలిసి వచ్చింది
చమురు బావుల యుద్ధమట
సరిహద్దు ఆక్రమణల యుద్ధమట
ఒకచోట నలుపూ తెలుపుల వర్ణయుద్ధం
మరోచోట కులాల యుద్ధం
ఇంకెక్కడో మతాల యుద్ధం
అంతా మనిషి మెదడుపై భీకర యుద్ధం
లేత మనస్సులపై కాంక్ష ఆడుతున్న కర్కశ రక్త క్రీడ
ఆధునిక భావజాలం విసిరిన పంజా
ఏ భూమినీ పచ్చగా ఉండనీయదన్నది నిజం
ఒకటి పూర్తి అయ్యాక మరో
ఎడారికోసం బయలుదేరుతారన్నది పచ్చినిజం
ఎక్కడైనా ఆధిపత్యానికే యుద్ధం
బలవంతుల చెలగాటం
బలహీనుల ప్రాణసంకటం
చరిత్ర అంతా ఇంతే
ప్రతి పుటలోనూ రుధిర దాహపు లిఖితాక్షరాలే
ఇది నిజం! ఇదే నిజం!!
– నస్రీన్‌ ఖాన్‌