అమ్మ ఎవరికైనా అమ్మే

అమ్మ ఎవరికైనా అమ్మేఅదో గది. అదో ఇరుకు గది. ఆ గదిలో ఉన్నది మంచం అది. మంచం మీద ఉన్నదదో బాడీ. అది అర్థరాత్రి గురక పెడ్తున్న ఓ మనిషి ‘ఓన్‌ ప్రాపర్టీ’. గురకపెడ్తున్న మనిషి బాడీలోంచి మనిషి పైకి లేచాడు. పొగలా కదిలాడు. లీలగా కనిపించే లోపలి మనిషి మూసి ఉన్న గది తలుపు తెరవకుండానే బయటకు నడిచాడు.
తనున్న మేడ మీదినుంచి దిగడానికి మొదటి మెట్టు మీద కాలు పెట్టి ‘హుమ్‌’ అన్నాడు. చివరి మెట్టు దగ్గరున్నాడు. ఇంటి గేటు మూసి ఉంది. దానికి లోపల్నించి తాళం వేసుంది. లోపలి మనిషికి గేటు తెరిచే అవసరం లేకపోయింది. గాలిలో తేలినట్టుందే అని పాడుకుంటూ రోడ్డు ఎక్కేడు. ఆ వీధిలోనే ఆధార్‌ కార్డు లేకుండా ఉంటూ వున్న వీధి కుక్క మనుషుల్ని చూస్తే చాలు అరిచి గీపెట్టే కుక్క అరవలేదు. బహుశా దాని నిద్ర కళ్ళకి ఈ మనిషి కనిపించలేదేమో.
ఇలా అర్థరాత్రి పూట ఇరుకు గదిలో మంచం మీద తన బాడీని గురకకు వదిలేసి వీధుల వెంట తిరగడం, లోపలి మనిషికి థ్రిల్లింగ్‌గా, ఎక్సయిటింగ్‌గా ఉంది. వీధి లైట్లు వెలుగుతూ ఆ మనిషివైపే చూస్తున్నవి. వాటి వెలుగులో అతను రోడ్డును చూస్తున్నాడు. చల్లగాలి ఆ మనిషి చెంపల్ని తాకుతూ వెళ్తున్నది. నిశ్శబ్దం అతని అడుగుల చప్పుడుకు ఉలిక్కిపడుతున్నది. నడుస్తున్న మనిషి సిటీ మధ్యకు వచ్చేశాడు. ఇంత దూరం నడిచినా అలసటే లేదు అనుకు న్నాడు. నడిస్తే కదా, గాల్లో తేలివస్తే అలసట ఉంటుందా అని నవ్వుకున్నాడు. తనలో తను నవ్వుతున్నాడు కనుక శబ్దం రాలేదు.
నడస్తున్న మనిషి కాదు కాదు గాల్లో తేలుతున్న మనిషి ఒక చోట టక్కుమన్న శబ్దం చేయకుండానే ఆగిపోయాడు. అక్కడ ఓ రాతి దిమ్మ కనిపించింది. ఆ దిమ్మ మీద ఓ అమ్మ ఉంది. ఎవరా అమ్మ? ఎవరా తల్లి? అని ఆగిపోయిన మనిషి నిటారుగా నిలబడి, కళ్లు వెడల్పుగా తెరిచి చూశాడు. ఎవరీమె? అని తన్ను తనే ప్రశ్నించుకున్నాడు. విగ్రహంగా నిలబడి ఉన్న తల్లి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అదేం శారీనో గానీ ఖరీదైనదే అనుకున్నాడు. తల మీద బంగారు కిరీటం ఎన్ని కిలోలు ఉంటుందో ననుకున్నాడు. మెడ నిండా హారాలు ధగధగమంటున్నాయి. నడుంకి వడ్డాణం జిగేలుమంటున్నది. వీధి లైటు వెలుతురులో మెరిసిపోతున్న ఆమె ఒక చేతిలో బతుకమ్మ ఉంది. మరొక చేతిలో ధాన్యపు కంకులున్నవి. ఆమె ముఖంలో రాజరికం ఉట్టిపడుతున్నది.
ఊరికే చక్కర్లు కొట్టకపోతే కుదురుగా నించోరాదూ. ఎందుకలా దొంగోడిలా నా నగల్నే చూస్తున్నావు అంది దిమ్మ మీద నిలబడి ఉన్న అమ్మ. ఉలిక్కిపడ్డాడు. గాల్లో తేలుతూ వచ్చినవాడైనా మనిషి మనిషే కదా. అమ్మా! సారీ అమ్మా! అంత మాట అనకమ్మా. నేను అర్థరాత్రుళ్లు కొంపల్లో దూరే దొంగను కానమ్మా. మామూలు మనిషినమ్మా. ఇంగ్లీషులో నన్ను ‘కామన్‌ మ్యాన్‌’ అంటారమ్మా అన్నాడా మనిషి. అలా చెప్పు. కామన్‌ మ్యాన్‌వి కనుక నా సేఫ్టీకి ప్రమాదం లేదు. రాజకీయ నాయకుడివి కాదు కనుక నా ఉనికికి డేంజర్‌ లేదు. ఎందుకోయీ ఇలా అర్థరాత్రిపూట పండుకున్న బాడీలోంచి లేచి తేలుతూ తిరుగుతున్నావు అంది ఆమె. ఏం చెప్పను తల్లీ. పొద్దంతా అడ్డమైన చాకిరీ చేసి, అర కడుపుకు తిండి పెట్టినా, అదేంటో మంచం ఎక్కగానే నిద్ర ముంచుకు వస్తుంది. నిద్రలో నిజంగా చేయలేని పనులన్నీ చెయ్యడానికి కలలు వస్తయి. వాటి బలంతో ఇలా గాల్లో తేలిపోతూ ఎక్కడికైనా వెళ్తుంటా. స్టార్‌ హోటళ్లల్లో దూరి తినలేనివన్నీ తింటుంటా, ఖరీదైన మాల్స్‌లో దూరి కొనలేనివన్నీ కొంటుంటా. డ్రైవింగ్‌ రాదు కానీ అన్ని రకాల కార్లూ నడిపేస్తా, పైలెట్‌ని కాను గానీ విమానాన్ని గాలిలో పల్టీ కొట్టిస్తనన్నాడు ఆ మనిషి.
నువ్వు మామూలు మనిషివి కనుక నిద్ర పోగల్గుతున్నావు. నిద్రలో కలలు కంటున్నావు. తిరగడానికి కార్లు, ఊరేగడానికి విమానాలు, ఖర్చు చెయ్యడానికి కోట్లు, సంపాదించడానికి పదవులు లేవు కనుక నిద్ర పోగల్గుతున్నావు. కలలు కంటున్నావు. నన్ను చూడు నిలువెత్తు విగ్రహంలా నిలబడ్డం తప్ప ఏమీ చెయ్యలేను. చూడు ఈ కిరీటం బరువు మోయడం తప్ప తీసి పక్కకు పెట్టలేను. ఒంటినిండా నగలున్న ఈ తల్లి వచ్చీపోయే పేదవాళ్లకు ఏమీ చేయలేదు. నేను సంపన్నురాలినే కాని నా బిడ్డల పేదరికాన్ని ఎలా పోగొట్టగలనో తెలీదు అంది దిమ్మ మీద ఉన్న అమ్మ. ఆ తర్వాత ఆమె మరొక్క మాట మాట్లాడలేదు. ఇక ఈమె మాట్లాడదేమో ననుకుంటూ గాల్లో తేలుతూ ముందుకు వెళ్లాడు మనిషి. అలా తేలిన మనిషి మరో దిమ్మ, దిమ్మ మీద అమ్మ దగ్గర వాలాడు. ఎవరీ అమ్మ ఎవరీ తల్లి అని ఆగిపోయిన మనిషి నిటారుగా నిలబడి, కళ్లు వెడల్పుగా తెరిచి చూశాడు. ఇదేం శారీ సాదాసీదాగా ఉంది అనుకున్నాడు. తల మీద బరువైన బంగారు కిరీటమేదీ అనుకున్నాడు. మెడ తిరిగే వెసులుబాటు లేనన్ని ధగధగలాడే నగలు లేవు. నిరాడంబరంగా, స్వచ్ఛమైన చిరునవ్వు ముఖంలో ప్రతిబింబిస్తుంటే చేత ధాన్యపు కంకులు పట్టుకుని నిలబడ్డ ఈమె ఎవరా అని ప్రశ్నించుకున్నాడు. పాత తల్లి స్థానంలో వచ్చిన కొత్త తల్లా అనుకున్నాడు.
నీలో నువ్వే మాట్లాడుకోకపోతే నన్నడగ రాదూ. అప్పుడంటే ఒళ్ళంతా బంగారం ఉండేది కానీ ఇప్పుడు నేను నీకేమీ ఇవ్వలేను అందామె. అది సరే కనీ అమ్మా అక్కడా నువ్వే ఇక్కడా నువ్వే కాకపోతే ‘రిచ్‌నెస్‌’లో తేడా అవుపడ్తున్నది అన్నాడు మనిషి. తల్లిని కద బిడ్డలు ఎలా ఉండమంటే అలా ఉండాల్సిందే కదా. ఒకరు కిరీటం పెట్టారు. మరొకరు తీసేశారు. ఇకముందు ముందు ఎవరొస్తారో, నన్ను ఎలా నిలబెడ్తారో ఎవరికి తెల్సు. రోజులు మారినప్పుడల్లా తల్లులు మారవలసిందేనా అమ్మా అన్నాడు అమాయకంగా మనిషి. అప్పుడు నాలుగు కోట్ల మంది నాకు కిరీటం పెట్టమన్నారని పెట్టారు. ఇప్పుడు నాలుగు కోట్ల మంది తీసెయ్యమన్నారని తీసేశారు. ఒక సంగతి చెప్తా దగ్గరికి రా అంది అమ్మ. మనిషి చెవి అప్పగించాడు. నేను ఎలా ఉండాలో నాలుగు కోట్ల మందికే పట్టింది. రాజులకూ, రాజులు కావాలనుకునే వాళ్లకూ నేను కావాలి, వాళ్లకిష్టమైన రూపంలో నిలబడాలి అంతే. ఇప్పుడు నా కుడి చెయ్యి ఖాళీగా ఉంది చూశావుగా. ఇది హస్తం అభయ హస్తం అన్నమాట అంది అమ్మ. ఒంటి మీద నగలన్నీ పోయి, తలమీద కిరీటమూ లేక ఏం అభయం ఇస్తావమ్మా అని నిట్టూర్చాడు మనిషి. అమ్మ అంటే ప్రేమ స్వరూపం నాయనా. అది ప్రతి మనిషిలోనూ ఉండే తనకిష్టమైన రూపం. నీ అమ్మ నీకూ నా అమ్మ నాకూ కాదు బిడ్డా. అమ్మ ఎవరికైనా అమ్మే అన్న అమ్మ ఇక మాట్లాళ్లేదు. ఎలా గాల్లో తేలుతూ వచ్చాడో అలాగే మనిషి వెనక్కి తిరిగి వచ్చి మంచం మీద గురకపెడ్తున్న బాడీలో ప్రవేశించడంతో ఇటు నుంచి అటు కదిలాడు మనిషి.

చింతపట్ల సుదర్శన్‌
9299809212