అమ్మ గెలుస్తుంది..

అమ్మ గెలుస్తుంది..సూరీడు మండుటెండగా
తన ప్రతాపాన్ని చూపుతున్న
మధ్యాహ్నవేళ
బక్కపలుచని తనువుతో
ఆకలిని దిగమింగిన
కూడు దొరకని ఎముకలగూడుతో
తన నడినెత్తిన బ్రతకాలనే
బరువు ఆశను మోస్తూ..
తన చేతులలో ఆటాడుతున్న
పిల్లల భవిష్యత్తును చూస్తూ
నిండు పున్నమిలో చుట్టూ
అలుముకున్న అమావాస్య చీకటిలా
యుద్ధాదిపత్యం చెలాయిస్తున్న
అయోమయ ఆందోళన
సందర్భంలో అడుగులు వేస్తూనే
ఆక్సిజన్‌ సంకేతం తెలీని
ఓ అమ్మ అడుగుతోంది..
అందమైన ఈ ప్రకతిని..!
ఇదేంటని…? రేపు ఉంటుందా?
రేపటికి మనం వుంటామా అని…?
కాలం కన్నెర్ర చేసిన
ఈ పరిణామ విధ్వంసంలో వలస పక్షుల్లా..
వలస జీవులమైన మాకు
దారి కనపడుతూనే వుంది…!
కానీ గమనంలోని గమ్యమే
అదశ్యమవుతుందని..!
వైద్యుడు.. దేవుడు..
ఎక్కడున్నాడో తెలీదు కానీ…
అహింసా రూపంలో మనిషి
మానవత్వమై బ్రతికుడున్నాడని..
ప్రకతి అంటోంది.. ఆ అమ్మతో..!
పాపం, పుణ్యం ప్రక్కనపెడితే…
పుట్టిన ఊరికి చేరేలోపే పాణం
వుంటుందా అనే సంశయం ఓ ప్రక్క..!
అన్నం దొరకక.. ఏంజరుగుతుందో అర్థంకాక
కాలే కడుపులో సంగీతం పసిగట్టలేని
ఆకలి స్వరాలు ఇంకో ప్రక్క..!
ఎలాగైనా జీవిత ఆటలో గెలవాలనే ఆరాటం
విధి విసిరేసిన వింత నాటకంలో నిలవాలనే
నిరంతర పోరాటంతో…
బ్రతుకు దెరువు కోసం బాటసారులై కదిలింది
అమాయక ప్రజల అమ్మల సైన్యం..!
వలస బ్రతుకులు జీవితంతో
చేస్తున్న నిరంతర యుద్ధం..
అంతరాయం లేకుండా
కొనసాగుతూనే వుంది..!
ప్రభుత్వాల దయ దాక్షిణ్యాల
మాయల మాటున…!!
ఏదేమైనా… అమ్మ గెలుస్తుంది..!
పిల్లల్ని బ్రతికిస్తుంది..!
యుద్ధం ఏమి చేయలేక ఓడిపోతుంది..!
వలస జీవుల రాకతో పల్లెసీమలు
మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ
పట్టణాలను ఎగతాళి
చేస్తూనే వుంటాయి…!!
మళ్ళీ మన అనుకునే
పాతరోజులొచ్చాయని..!!
(యుద్ధం సమయంలో వలస బ్రతుకులకు అక్షర రూపం)
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536