– బ్యాంకు సిబ్బందిని నిలదీసిన రైతులు
నవతెలంగాణ-లింగంపేట్
ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు డ్రా చేయడంతో పలువురు రైతులు బ్యాంకును ముట్టడించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎదుట గురువారం రైతులు బైటాయించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య అనే వ్యక్తి గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. కాగా మూడు రోజుల క్రితం కిష్టయ్య ఖాతా నుంచి రూ.4900లను ఇతరులు డ్రా చేశారు. అయితే బ్యాంక్‌లోన్ లేనట్టు గత మార్చి మూడో తేదీన ఎన్వోసీ ఇచ్చిన అధికారులు.. తాజాగా పంట రుణం ఉన్నట్టు అక్టోబర్‌లో రూ.26,970 బ్యాంక్ ఖాతాలోకి జమ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఓసీ ఇచ్చిన అధికారులు తిరిగి వ్యవసాయ రుణం వసూలు చేయడంపై కుటుంబ సభ్యులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్టు వారు వెల్లడించారు. రుణమాఫీ వర్తించినప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయకుండా నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపించారు. కొత్త రుణాల కోసం రైతులు అడిగితే ఇవ్వడం లేదని, బ్రోకర్లను ఆశ్రయిస్తేనే ఇస్తున్నారని మండిపడుతూ బ్యాంక్ మేనేజర్ అర్యరాజ్తో పాటు సిబ్బందిని రైతులు నిలదీశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో బ్యాంకు తెరవకుండా రైతులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లింగంపేట్ ఎస్ఐ ప్రభాకర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్‌పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.