– అధికారంలో ఎవరున్నా ఓకే.. వాటాలు వెళ్తే అక్రమాలకు అడ్డేలేదు
– విలువైన భూములు కైవసం
– కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై ఫిర్యాదులు.. స్పందన కరువు
– భూములను కాపాడుతామన్న మాటలు నీటి మూటలేనా..!
– అధికార పార్టీ నేతలకే అంతుచిక్కని ప్రశ్న
‘అధికారంలో ఏ ప్రభుత్వం ఉందన్నది కాదు.. ఆ ప్రభుత్వంలోని పెద్దలు తమ కనుసన్నల్లో ఉంటే చాలు’ అన్న చందంగా రియల్ వ్యాపారుల వ్యవహారం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో పెద్దల అండతో విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన వారు ఇప్పుడు ఆ భూములను కాపాడుకోవడానికి ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న వారికీ ఎర వేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామన్న అధికార పార్టీలోని కొంత మంది ముఖ్య నేతలను బడాబాబులు కాసులతో కబ్జా చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాసులమాయలో పడి వారు ప్రభుత్వాన్నే మాయ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఆనాటి ప్రభుత్వ పెద్దల అండతో ప్రభుత్వ భూములు, భూదాన్, వక్ఫ్‌బోర్డు, సిలింగ్, ఫారెస్ట్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా పెట్టి వెంచర్లు చేశారు. జిల్లాలో వందల ఎకరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను, చెరువు, కుంటల భూములను కాపాడుతామని చెప్పింది. అందుకు రెవెన్యూ అధికారుల నుంచి మండలాల వారీగా పాత రికార్డు, సేత్వారు ప్రకారం వివరాలు సేకరించే పనిలో పడింది. కానీ పక్కాగా ఆ భూములు ప్రభుత్వ భూములని రెవె న్యూ అధికారులు తేల్చి చెప్పినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ఆధికార పార్టీ నాయకులే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిసింది. ఫిర్యాదులు చేసిన ఒకట్రెండు రోజుల్లోనే బాధితులకు ఫోన్ కాల్స్ రావడంతో తేరుకోలేకపోతున్నారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేదారిలో మహేశ్వరం మండ లం కొంగరకుర్దు(ఏ) రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 2 నుంచి 400 వరకు దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ ఖిబ్లా పేరిట రికార్డుల ప్రకారం సుమారు 500 ఎకరాలకు పైగా వక్ఫ్‌్ భూమి ఉంది. 1954 నుంచి రికార్డుల్లో పట్టాదారు కాలంలో దర్గా పేరు నమోదైంది. ఇందులో సర్వే నెంబర్ 86, 87, 88, 89లో సుమారు 52.25 ఎకరాలు భూమిని చెట్కూరి వారసులు సాగు చేసుకుంటున్నారు. 2010లో రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు నష్ట పరిహారం కూడా చెల్లించింది. అయితే ఈ భూమి ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉండటంతో ఆనాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు పత్రాలతో ఓఆర్‌సీలు సృష్టించి 52.25 ఎకరాల భూమిని కాజేశారు. అయితే ఈ భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా రెవెన్యూ అధికారు లు తేల్చి చెప్పారు. అయినా ఆ భూములను కాపాడటం లో గత ప్రభుత్వ వైఫల్యం చెందింది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న ఫిర్యాదుదారులు నిరాశే ఎదురవుతోందంటున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇదే మండలం నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 181, 182లో 50 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూములుగా మార్చి ప్రభుత్వ పెద్ద అండతో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించారు. స్థానికులు కోర్టుకు వెళ్లాడంతో కోర్టు ఈ భూములు భూదాన్ భూములని తేల్చింది.అయినా ఇంకా ప్రభుత్వ స్వాధీనం కాలేదని తెలిసింది. ఇలాంటివి జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు గత ప్రభుత్వంలో కబ్జాకు గురయ్యాయి. ఆ భూములపై అధికార పార్టీ నాయకులు పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు మాట్లాడుకోవడం గమనార్హం.
రియల్ వ్యాపారుల ఎరలో పెద్దలు
గత ప్రభుత్వంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పెద్దల కనుసన్నల్లోనే కబ్జాకు గురయ్యాయని, వారిపై చర్యలు తప్పవని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది పెద్దలు.. గత ప్రభుత్వంలో మాదిరిగానే రియల్ వ్యాపారుల ఎరలో పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేసిన వెంటనే రియల్ వ్యాపారులతో మంతనాలు జరిపి సమస్యలు బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఫిర్యాదులపై ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు చేయకపోతే ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.