– ఎర్రజెండా ఔన్నత్యాన్ని చాటాలి
– కమ్యూనిస్టుల పోరాటం వల్లే సంక్షేమ పథకాలు: పుట్టపాక రోడ్ షోలో చెరుపల్లి సీతారాములు
– ప్రజలను ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది : ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలను ఓడించి ఉద్యమ పార్టీల నాయకులను గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్ ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. భువనగిరి కమ్యూనిస్టుల కోట అన్నారు. మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన రావి నారాయణరెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించిన ఈ ప్రాంత ప్రజలు ఎర్రజెండా ఔన్నత్యాన్ని చాటి చెప్పారన్నారు. మళ్లీ జహంగీర్ కోసం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై అధిక ఓట్లు వేసి దేశవ్యాప్తంగా ఎర్రజెండా ప్రాధాన్యతను పెంచాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను మార్చనున్నాయన్నారు. ఎట్లాంటి ఉద్యమ చరిత్ర లేని రాజకీయ వ్యాపారులైన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. నిస్వార్థంగా 35 ఏండ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్న ఎండి జహంగీర్‌ను గెెలిపించాలని కోరారు. బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తోందని విమర్శించారు. మోడీ పదేండ్ల కాలంలో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే కాకుండా ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేష్, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎట్లాంటి ఉద్యమ చరిత్ర లేదన్నారు. గెలిచే వరకు ఒక పార్టీ.. గెలిచాక మరో పార్టీ మారే చరిత్రహీనులకు ఓట్లు వేయొద్దని అన్నారు. పుట్టపాక ప్రజా ఉద్యమ కేంద్రంగా కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, నాయకులు జి.శ్రీనివాసచారి, గౌడ యాదిరెడ్డి, దొంతగోని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, పిట్ట రాములు, కేసిరెడ్డి యాదవ రెడ్డి, చింతకాయల నరసింహ, వర్కాల చంద్రశేఖర్ రావిరాల మల్లేష్, శివశక్తి లాలయ్య పాల్గొన్నారు.
ప్రజల ఓట్లతో గెలిచి 15 ఏండ్లు భోగాలు అనుభవించిన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం)కు మాత్రమే ఆ హక్కు ఉంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తేవడం, సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. అలాంటి వారికి ఈ ప్రాంత ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదు? ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
– భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్