ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక బృందాల నిఘా..

– పోలింగ్ ప్రవర్తనా నియమావళి ప్రకారమే నామినేషన్ స్వీకరణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట:
ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక బృందాల పర్యవేక్షణ, నిఘా పటిష్టంగా ఉంటుందని, ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు స్పష్టం చేశారు. ప్రచారంపై సంబంధిత శాఖల నుండి అనుమతి తీసుకోవాలని సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నామినేషన్ లు స్వీకరణ, పోలింగ్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ఎలా నామినేషన్ దాఖలు చేయాలని, అందుకు అవసరమైన మద్దతుదారులు, దరఖాస్తు పూర్తి చేసే విధానాన్ని వివరించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ. 40 లక్షలు ఉంటుందనీ, ప్రచారంపై చేసే ఖర్చులు మొత్తం బ్యాంక్ ఖాతా ద్వారానే నిర్వహించాలని, రూ.10 వేలకు మించి నగదు చెల్లింపులు చేయవద్దని చెప్పారు. అంతకు మించి నగదు చెల్లించాల్సి వస్తే చెక్ లేదా బ్యాంక్ ద్వారానే చేయాలని తెలిపారు. వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, సోషల్ మీడియా పైనా అధికారుల నిఘా ఉంటుందని, ఎన్నికల నియమావళిని అతిక్రమస్తే కేసులు తప్పదని హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, ఓటర్లను కూడా ప్రలోభాల కోసం ఇబ్బందులకు గురి చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశాడు. అనుమతులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో పోలీస్ నోడల్ ఆఫీసర్, పాల్వంచ డీఎస్సీ వెంకటేష్ వివరించారు. సమావేశంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, స్థానిక తాహశీల్ధార్ కృష్ణ ప్రసాద్, సీ.ఐ కరుణాకర్, ఎస్.ఐ శ్రీశాంత్, ఎస్.ఎచ్.ఒ, ఎస్.ఐ శ్రీకాంత్, పలు రాజకీయ పార్టీల బాధ్యులు పాల్గొన్నారు.