రాకాసి గోళ్ళు

Monster nailsసన్నగా వినిపిస్తున్న పాటకు రిధమిక్‌ గా ఊగుతూ థమ్సప్‌ తాగుతూ.. లాన్లో తిరుగుతున్నాడు ప్రముఖ సినీహీరో మనోహర్‌. చతుష్ట దిగ్గజాల్లాంటి బాడీగార్డ్స్‌ అతనికి దగ్గరలో తారాడుతున్నారు. షూటింగులు, పబ్లిక్‌ షోలు లేని సమయాల్లోనూ తనను నిముషం కూడా వదలని వారి విధేయత ఎంతో గొప్పగా అనిపించినా, ఒక్కోసారి విసుగు కూడా తెప్పిస్తుంటుందతనికి. మేనేజర్‌ సాగర్‌ దగ్గరనుండీ మూడోసారి వచ్చిన కాల్‌కు బదులిస్తూ..
”ఏంటి సాగర్‌! మళ్ళీ ఆ దర్శక సూర్యగారు ఫోన్‌ చేశారా? భారీ ఎత్తున బాక్సాఫీసులు బద్దలు కొట్టాలంటూ, సంవత్సరం నుంచీ ఒకే సినిమా కోసం మమ్మల్ని యమ బాదేస్తున్నాడా చంద్రమౌళి. ఇప్పుడప్పుడే నేను వేరే ఏ సినిమాకూ డేట్స్‌ ఇవ్వలేను. నాలుగు రోజుల రెస్ట్‌ తరువాత మళ్ళీ చంద్రమౌళీ కాల్షీట్స్‌ వున్నాయి. ఈలోగా సూర్యగారి కాల్స్‌ ఏమిటి?”
”దర్శక సూర్య ఫోన్‌ చేయలేదు సర్‌! కానీ, మీ దర్శనం కావాలని ఒక పాతికా ఇరవైమంది పీ, క్యూ, డబ్ల్యూ, ఎక్స్‌, వై, జెడ్‌ ట్యూబు చానల్స్‌ వాళ్ళు మూడు రోజులుగా కాల్స్‌ చేస్తున్నారు. మీరేమో వినిపించుకోవడం లేదు”
”సాగర్‌! ఇప్పుడెవరికి అపాయింట్మెంట్‌ ఇచ్చినా మేకప్‌ వేసుకోవాలి. అన్నింటికన్నా ముందు విగ్‌ పెట్టుకోవాలి. ఇక నాకు రెస్టేముంది?” విసుగ్గా అంటూ, పలుచబడ్డ తలను లాలనగా నిమురుకున్నాడు.
”కానీ సర్‌, వాళ్ళు చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని పదేపదే అడుగుతున్నారు”
”ఏమడుగుతారు వాళ్ళు.. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎప్పుడు రిలీజవుతుంది? నెక్స్ట్‌ ఏ దర్శకుని సినిమాకి సైన్‌ చేస్తున్నారు? ఈసారి మీ హీరోయిన్‌ ఆమెనా, ఈమెనా, ఇంకో ఆమెనా? ఇలాంటి ప్రశ్నలు వేసి చంపుతారు. అంతేకదా!”
”సరే సార్‌. సార్‌ చాలా బిజీగా వున్నారు. ఒక నెలరోజుల వరకు మాట్లాడడం కుదరదు అని చెప్పేస్తాను”
”వద్దులే సాగర్‌! రేపు మధ్యాహ్నం రమ్మను. మాకూ, ప్రేక్షక దేవుళ్ళకు మధ్య జెడ్‌ ట్యూబ్‌ ఛానెళ్ళ వాళ్ళు, పూజార్ల వంటి వాళ్ళు. వీళ్ళని ప్రసన్నం చేసుసుకోకపోతే ఆగ్రహించి రాక్షసులైపోతారు. వాళ్ళ పదునైన గోళ్ళతో మమ్ముల్ని చీల్చి చెండాడేస్తారు.”
ఇంతటి అంతర్జాతీయ ఖ్యాతి వున్న హీరో కూడా, జెడ్‌ ట్యూబు ఛానల్స్‌ వాళ్ళంటే ఇంత భయపడ్తారా.. అని సాగర్‌ ఆశ్చర్యపోయాడు. తనకు ఫోన్‌ చేసిన వాళ్ళందరినీ మర్నాడు మధ్యాహ్నం రమ్మని చెప్పాడు. లాన్లో కుర్చీలు వేయించి, టీ స్నాక్స్‌, కూల్‌డ్రింకులు ఏర్పాటు చేశాడు.
గమ్మత్తుగా ఛానెల్స్‌ వాళ్ళెవరూ ఎప్పుడూ ఉపయోగించే భారీ వాహనాల్లో రాలేదు. కొందరు కార్లల్లోనూ, టూ వీలర్స్‌ పైనా వచ్చారు. ఎవరి చేతుల్లోనూ, ఛానల్‌ యాంబ్లం వున్న కెమెరాలు, మైకులూ కూడా లేవు. మఫ్టీలో వున్న పోలీసుల్లా నిశ్శబ్దంగా వచ్చారు. సాగర్‌, అతని బృందం ఎందుకైనా మంచిదని వాళ్ళందరినీ క్షుణ్ణంగా పరీక్ష చేశాకే లోపలికి అనుమతించారు.
”సార్‌ వాళ్ళెవరూ వాళ్ళ ఆఫీస్‌ వాహనాల్లో రాలేదు” ‘మొబాగా’ (మొదటి బాడీగార్డ్‌) చిన్నగా చెప్పాడు.
”సార్‌ వాళ్ళు కెమెరాలు, మైక్‌లూ లేకుండా వచ్చారు. ఇది కొంత వింతగా ఉన్నది” గుసగుసగా చెప్పాడు ‘రెంబాగా’ (రెండవ బాడీగార్డ్‌)..
”హమ్మయ్య! నాకు ఆ లైట్లు, కెమెరాలు, మైకులంటే విసుగొస్తున్నది.. అవేమీ లేకుండా రావడంకంటే ఇంకేం కావాలి?” అన్నాడు.
అతని పరివారం, బాడీగార్డ్స్‌ ఆ చుట్ట్టు పక్కలే తచ్చాడుతుండగా.. మనోహర్‌ మనోహరంగా వచ్చి కూర్చున్నాడు. పరస్పర పలకరింపులయ్యాక..
”సార్‌ మీతో ఏకాంతంగా మాట్లాడాలి” అన్నారు వాళ్ళు. మనోహర్‌ ఆశ్చర్యపోతుండగా.. కరి మబ్బులు కమ్ముకున్నట్టు అతని బాడీగార్డ్స్‌ మరింత చేరువగా వచ్చి నిలిచారు.
”నాకూ, మా వాళ్ళకూ మధ్య రహస్యాలేం వుండవు. మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు”
అంతే! జెడ్‌ ట్యూబు ఛానల్‌కి చెందిన వ్యక్తులందరి కళ్ళు.. కెమెరా లెన్స్‌లా ముందుకు పొడుచుకువచ్చాయి. వాళ్ళందరి చేతులకు, గోర్లు బాగా పెరిగిన.. పాతిక ముప్పై బొటన వేళ్ళున్నాయి. ఆకస్మాత్తుగా ‘ఎక్స్‌’ ఛానలాయన ”ఏం మాట్లాడమంటారు హీరోగారూ! మీరింతపని చేస్తారనుకోలేదు” గుత్తుల వేళ్ళ చేతులతో ముఖం కప్పుకుని బావురుమన్నాడు.
”అయ్యో! నేనేంచేశాను. ఎందుకలా ఏడుస్తున్నారు?” మన హీరోగారు మహా కంగారుపడ్డారు.
”నిజం సార్‌! మీరంటే మాకెంతో అభిమానం. మమ్మల్నిలా అన్యాయం చేస్తారనుకోలేదు” రెండు చేతులకు గుత్తులుగా వున్న బొటనవేళ్ళతో గుండెను బాదుకున్నాడు ‘వై’ ఛానాలాయన. అన్నన్ని బొటనవేళ్ళ గుత్తులను చూసి బెదిరిపోయాడు మనోహరుడు.
”సార్‌! మీరు మా అందరికీ, అన్నం పెట్టే దేవుడు అనుకున్నాం, కానీ మా కడుపులు కొడతారనుకోలేదు” ‘క్యూ’ ఛానలాయన నలభై బొటన వేళ్ళతో మెటికలు విరిచాడు.
హీరో కాబట్టి గుంభనంగా వున్నట్టు నటిస్తున్నాడు కానీ, వారికున్న కెమెరా లెన్స్‌ కళ్ళూ, గుత్తుల బొటనవేళ్ళు, వాటికున్న రాకాసి గోళ్ళూ చూసి, మానవ మాత్రుడైన మనోహార్‌ దడుచుకోకుండా ఎలా వుంటాడు?
వాళ్ళు వేస్తున్న నిందలకు, ఆరోపణలకు బాడీ మండిన బాడీగార్డ్స్‌ మాత్రమేకాక, అక్కడున్న అతని పరివారమంతా కోపంతో రగిలిపోతున్నారు. మనోహార్‌ కనుసైగ కోసం చూస్తున్నారు. వాళ్ళంతా వచ్చిన వాళ్ళని తన్నేస్తారేమో, అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుందేమో అని భయపడసాగాడు సాగర్‌.
”సరే సరే! మీ అందరి మాటలు వింటాను. ముందు మీరు కాస్త రిలాక్సవ్వండి” అంటూ రిఫ్రెష్మెంట్‌ టీం ని పిలిచాడు హీరో.
ఇప్పుడు స్నాక్స్‌ ఆరగిస్తున్న వాళ్ళ కళ్ళు మామూలుగా మారిపోయాయి. వాళ్ళ చేతులకిప్పుడు అయిదు వేళ్ళే వున్నాయి. వీళ్ళు పెట్టిన స్నాక్స్‌ పది నిముషాలలలో లాగించినా, డ్రింక్స్‌ సేవించినా, వాళ్ళందరికీ ఇంకా ఒకటే ఆకలీ.. దాహమూనూ.. తనతో మాట్లాడాలనుకున్న ఆ మాటలేవో మాట్లాడితేగానీ వాళ్ళ ఆకలికి, దాహానికి ఉపశమనం దొరకాదేమో అనుకున్న మనోహర్‌..
”సరే ఇక చెప్పండి” అన్నాడు.
”సార్‌! మా మాట విని, కొంతకాలం ఆగచ్చు కద సార్‌! మీ మూలానే మాకు మిలియన్స్‌ వ్యూస్‌ సార్‌” లెన్స్‌ అడ్జస్ట్‌ చేసుకున్న కళ్ళతో చూస్తూ ‘వై’ ఛానెల్‌ నిర్వాహకుని వేడికోలు.. మనోహర్‌ మళ్ళీ నివ్వెరపోయాడు.
”అయినా ఇప్పుడేమంత తొందరొచ్చిందని సార్‌.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?” ‘క్యూ’ ఛానల్‌ నిర్వాహకుని కెమెరా కళ్ళలో వింత క్యూరియాసిటీ.
”సర్‌! అతనే హేమంతగారి విడాకుల గురించి అవాకులూ చావాకుల వీడియోలు తీస్తూ బతుకుతున్న ఛానల్‌ ఓనరుడు” వెనక్కు తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా మెల్లగా మనోహర్‌ తో చెప్పాడు ‘మూబాగా’ (మూడవ బాడీగార్డ్‌).
”మేమంతా గత పదేళ్ళుగా మీ పెళ్ళివార్తలను ‘గోరువార్తలు’గా రాస్తూ బతుకుతున్నవాళ్ళం. మీ పెళ్ళి వార్తంటే మాకు మిలియన్‌ లైకుల పంట. ‘ఆమెతోనే ఆ హీరో పెళ్ళి’ ‘వచ్చే శ్రావణంలోనే మనో పెళ్ళి’, ‘మనువాడుతున్న మనోహర్‌’ అంటూ రాస్తూ.. బతుకులు వెళ్ళదీస్తున్నవాళ్ళం. కొంతకాలం ఇలాగే సాగనివ్వచ్చుగా సార్‌!” గుత్తుల వేళ్ళను బరుక్కుంటూ దీనంగా అన్నాడు ‘ఎక్స్‌’ ఛానలుడు.
”అది మిలియన్‌ లైకుల పంట కాదు, ఏ చెత్త రాసినా అది వాళ్ళకు కాసుల పంట.. మొన్ననే భర్త చనిపోయిన ఓ హీరోయిన్‌ కి.. ‘సోనా మళ్ళీ పెళ్ళి’ ‘రహస్యంగా అతన్ని పెళ్ళాడిన ఈమె’ అని గోరువార్తలు రాసింది ఇతగాడి ఛానలే సర్‌..!” మొబాగా గుసగుసగా చెప్పాడు.
”మీ సరసన నటించిన హీరోయిన్ల లిస్ట్‌లో నుండి ఒక్కో వారం ఒక్కొక్కరితో మీకు లంకె పెట్టిన వీడియోల లింకులు.. ఎంతమంది ఆబగా షేర్‌ చేసుకుంటారో తెలుసా! మీ పెళ్ళిని వాయిదా వేసుకోండిసార్‌!” ‘పీ’ ఛానల్‌ నరునికి ముప్పై బొటనవేళ్ళ గోర్లకి ముప్పై రంగులు వేసి వున్నాయి.
”సర్‌! అతనే, ప్రముఖ హీరో కూతురి విడాకుల గోరువార్తలను, తన ఛానల్‌ ద్వారానికి మామిడాకుల తోరణంలా కట్టి చూపి, జనానికి కాలక్షేపం చేస్తున్న ‘పీ’ ఛానల్‌ ఓనరుడు” ‘నాబాగా’ (నాలుగవ బాడీగార్డ్‌ ) అన్నాడు.
”ఆ ప్రముఖ హీరోకి ఇప్పట్లో కళ్యాణ గడియ లేదు.. అని నేను చెప్తున్న వార్తలను చెవులు వాచిపోయేలా వింటుంటారు జనం. మీరిప్పుడిలా పెళ్ళి చేసేసుకుంటే నా మాటలు ఏమైపోవాలి సార్‌? మీరు ఇప్పుడే పెళ్ళాడకండి సర్‌!” ప్రాదేయపడ్డాడు ఒకాయన.
అలా అన్న స్వరం ఎవరిదా అని ‘మొబాగా’ చూశాడు. ”ఓV్‌ా అతను భానుస్వామి కదూ రెంబాగా!” మరోవంక గాగుల్స్‌ పెట్టుకుని, జీన్‌ ఫాంట్‌, పూలచొక్కా వేసుకున్న స్వామిని కూడా గుర్తించి ”అతను కూడా మరో అవాకుల జ్యోతిష్యుడే..” కనిపెట్టాడు నాబాగా.
‘ఓహో అందరూ కలిసే వచ్చారన్నమాట. వీళ్ళంతా తమ హీరోకి ఏదన్నా ప్రమాదం తలపెట్టలేదు కదా!’ అనుకుంటూ, మరింత అప్రమత్తమై సీసీ కెమెరా విభాగానికి కొన్ని అత్యవసర సూచనలు చేశారు.
”పదేళ్ళుగా మీ పెళ్ళి గోరువార్తలతో ‘నిత్య కళ్యాణం పచ్చతోరణం’లా వర్ధిల్లుతున్న మా సకల జెడ్‌ ఛానళ్ళ వాళ్ళం ఇప్పుడేమైపోవాలి సర్‌? మీరిప్పుడు నిజంగానే పెళ్ళి చేసేసుకుంటే, మేమేం వార్తలు రాసుకోవాలి? ఏ వీడియోలు తీసుకోవాలి సార్‌?” మెల్లకన్ను భానుస్వామిగారు బలహీన స్వరంతో అడిగారు.
”గోరువార్తల లైకుల కోసం, వాటిమీద వచ్చే డబ్బుల కోసం.. ఒక హీరో పసిబిడ్డకు, పుట్టిన గంటలో జాతకం కూడా చెప్పేసింది కూడా ఈ భానుస్వామే! అంతేకాదు.. ఆ హీరోకి కళ్యాణ యోగం లేదు. ఒకవేళ ఆ హీరో పెళ్ళిచేసుకున్నా విడాకులైపోతాయి. ఈ హీరో త్వరలోనే మంచాన పడతాడు.. అది ఏ నెలో కూడా చెప్పేస్తాను. ఇంకో హీరో ఆత్మహత్య చేసుకుంటాడు అని వాగే దుర్మార్గ స్వామీ కూడా అతనే!” ‘మొగాబా’ ‘నాబాగా’ అతన్ని కోపంగా చూస్తూ చెప్పుకున్నారు. వీళ్ళను పట్టించుకోకుండా జెడ్‌ ట్యూబ్‌ ఛానల్‌ వాళ్ళందరూ మనోహర్‌ చుట్టూ చేరి.. బొటనవేలి గోర్లు కొరుక్కుంటూ.. పలురకాలుగా విన్నపాలు చేస్తున్నారు.
”మనోహర్‌ పెళ్ళికి గ్రీన్‌ సిగల్‌..”, ”ఆమే అతని వధువు”, ”మనోహర్‌ కళ్యాణం మనోహరం”.. ”అతని పెళ్ళి మరో నాలుగు నెలలు వాయిదా” ”మనువాడుతున్న మన హీరో” ఇలాటి వార్తల వీడియోలతో వేల వ్యూలు పొందుతూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ బతికేస్తున్న బడుగుజీవులం. మమ్మల మన్నించి మనువు వాయిదా వేసుకొనుమా!” వాళ్ళంతా బొటనవేళ్ళ గోర్లు చూసుకుంటూ గోముగా వేడుకుంటున్నారు.
మనోహర్‌ మాత్రం ఇంకా అయోమయం నుంచీ తెరుకోలేకపోతున్నాడు.
వీళ్ళంతా ఆకస్మాత్తుగా, మిడతల దండులాగా మనోహర్‌ దగ్గరకు రావడానికి కారణం ఏమిటా అని ఆలోచించాడు ‘మూబాగా’. అప్పుడతనికి వారం క్రితం జరిగిన దృశ్యం కళ్ళల్లో మెదిలింది.
షషష
మనోహర్‌ మహా అందగాడు. మంచి శరీర సౌష్టవం, చక్కని నవ్వు.. హావభావాలు దీటుగా పలికించగల నటనతో.. పదిహేనేళ్ళుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నాడు. నిర్మాతలకు కాసుల పంట పండించే హీరో మనోహర్‌. దర్శకుల ప్రతిభకు పట్టం కట్టిన నటన అతనిది. కానీ పదిహేనేళ్ళకి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఒకప్పుడు పచ్చగా పండిన వరిచేనులా వుండేది అతని జుట్టు. ఇప్పుడది ఆకులు రాలిన అడవిలా వుంది. అందుకే చెదురు మదురుగా వున్న అతని జుట్టుని, గుబురుగా గుబురుగా కప్పెట్టే విగ్గు లేకుండా అతను బయటకు రాలేడు. అతని పెళ్ళి గురించి అభిమానుల ఆత్రమే కానీ, విజయ దుంధుభీ మోగిస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న అతను, తన కళ్యాణానికి మాత్రం కాల్షీట్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. నలభయ్యవ పడిలోకి అడుగిడుతున్న అతనికింకా పెళ్ళికాలేదని కన్నతల్లి మాత్రం తెగ కలవర పడిపోతున్నది.
”అర్దశతం సినిమాలు పూర్తి చేశావు. ఇకనన్నా పెళ్ళిచేసుకోరా నాన్నా! అంటూ శతపోరింది. అతను మాత్రం ”ఈ సినిమా అవ్వగానే చేసుకుంటాను, ఆ సినిమా అవ్వగానే చేసుకుంటాను” అంటూ దాటవేస్తున్నాడు.
”ఒక్కో సినిమా రెండుమూడేళ్ళు తీస్తూ, ఒక్కో సినిమాకి రెండుమూడు సీక్వెల్స్‌ తీస్తూ.. ఆ దర్శకనిర్మాతలు నిన్ను ఆజన్మ బ్రహ్మచారిగా నిలబెట్టేస్తున్నారురా మనూ! మనువాడరా తండ్రీ! ఈసారి మాత్రం నా మాట వినకుంటే నిరాహార దీక్ష చేస్తాను” అని పట్టుబట్టింది సుమాంజలిదేవి.
”సరేనమ్మా! ఓ మూన్నెళ్ళలో చంద్రమౌళీ సినిమా అయిపోతుంది. అప్పుడు తప్పక పెళ్ళిచేసుకుంటాను” అన్నాడు. సుమాంజలీదేవి పరమానందంగా పరివారమందరికీ పరవాణ్ణం, గారెలు వండిపెట్టింది. పరవాణ్ణం తిన్నవాడొకడు పరవశంగా పరుగులు పెట్టి.. జెట్‌ స్పీడ్‌లో జెడ్‌ ట్యూబు వాళ్ళకొకళ్ళకి ఈ పెళ్ళినిర్ణయ విషయం చెప్పేశాడు. మనోహర్‌ పెళ్ళి వార్త పొగలా వ్యాపించి, వీక్షకుల చుట్టూ షికార్లు చేసింది. అంతే జెడ్‌ ఛానెళ్ళ వాళ్ళ గుండెల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బాధతో ఛానెళ్ళ కెమెరాల కళ్ళు మూసుకుపోయాయి. గాలి వార్తలతో గోలచేసే వారి మైకులు మూగబోయాయి. ఆదరాబాదరాగా అంతరంగిక సమావేశాలు జరిగాయి. ఆఘమేఘాల మీద గోరువార్తల బృందంవారు మనోహర్‌ చుట్టూ చేరి..
”ఆగాలి ఆగాలి, ఆగమంటే ఆగాలి, పెళ్ళాడకుండా ఆగాలి…!” అని గారాలు గునుస్తున్నారు.
వచ్చిన కొందరి కళ్ళు ఫ్లాష్‌ లైట్లలా వెలుగుతూ అరుతున్నాయి. మరికొందరు తమ పిడికిట్లో గుత్తులు గుత్తులుగా వున్న బొటనవేళ్ళను దాచుకోలేక గుండెలమీద, పొట్టమీద కొట్టుకుంటున్నారు.
”సార్‌! వాళ్ళందరికీ చురకత్తులలాంటి గోళ్ళున్నాయి. మీరు అనుమతిస్తే నెయిల్‌ కట్టర్లు తెచ్చి వాళ్ళ గోళ్ళు కత్తిరించి పంపిస్తాం” మొగాబా, రెంబాగా, మూబాగా, నాబాగా.. మనోహర్‌ ముందు రహస్య రంకెలు వేస్తున్నారు.
”పిచ్చి బాగాలు! (బాడీ గార్డులు) రాలిన జుట్టు మళ్ళీ రాకపోవచ్చు.. అందుకు నా తలనే నిదర్శనం. కానీ మన శరీరంలో మళ్ళీమళ్ళీ పెరిగేది గోర్లే. మీరు కత్తిరించి పంపినా అవి మళ్ళీ పెరుగుతాయి. దానికి వాళ్ళ గోర్లే సాక్ష్యం..” తల నిమురుకుంటూ అన్నాడతను
”అంటే ఇప్పుడేమంటారు సార్‌? పెళ్ళి చేసుకోకుండా ఇలా ఉండిపోతారా?” మొగాబా దెబ్బ తిన్నవానిలా అరిచాడు. ”ఏమైనా సరే! మీ అమ్మగారి కోరిక తీర్చాలి సార్‌ మీరు. మా సార్‌ తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు” నాగాబా ఘాటుగా అన్నాడు. ఇక మూబాగా ఆగలేకపోయాడు. ఆవేశంగా వాళ్ళ వైపుకి తిరిగాడు.
”అయినా, మా సార్‌ పెళ్ళిచేసుకుంటే మీకెందుకు? చేసుకోకపోతే మీకెందుకు? మొన్నటికి మొన్న అరవై యేళ్ళు దాటిన హీరోయిన్‌కి మళ్ళీ పెళ్ళి అన్న గోరువార్త మీ ఛానెల్‌లో చూపారు. ఆ జంట విడిపోయారు.. ఈ జంట కూడా విడిపోతారంట.. అంటూ ఘోరమైన గోరువార్తలు బోలెడు గుప్పిస్తున్నారు. ఎవరు విడాకులు తీసుకుంటే మీకెందుకు? కాపురాలు చేసుకుంటే మీకెందుకు? అసలు ఇలాంటి వార్తలు ప్రసారం చేయకుండా మీరు వుండలేరా?” రౌద్రంగా అడిగాడు.
”బాబూ.. బాగాలు! విత్తుముందా? చెట్టుముందా? అన్న సామెతకు జవాబు ఇంకా తేలలేదు. అలాగే.. ‘ప్రేక్షకులు ఏమి చూస్తున్నారో అవే తీస్తున్నాం’ అని దర్శకనిర్మాతలూ.. ‘దర్శకనిర్మాతలు ఏమి తీస్తున్నారో అవే చూస్తున్నాము..’ అన్న ప్రేక్షకుల సమర్థింపులకు, ఇప్పటికీ ముగింపులేదు.
ప్రస్తుతం ప్రపంచమంతా తలవంచుకు బతుకుతున్నది. సినిమాలన్నా కేవలం రెండుగంటల్లో ముగిసిపోతాయి. మిగితా ఇరవై రెండుగంటలు పిల్లలూ, పెద్దలూ అందరూ అరచేతుల్లో ఫోన్లు పెట్టుకుని తలవంచుకుని చూస్తున్నది.. మేం ప్రసారం చేసే గోరువార్తలే! గోరువార్తలు ఘోరంగా వుండక గోరుముద్దల్లా వుంటాయా? ప్రపంచమంతా ఇప్పుడు గాలి గాలిగా తీసే ఈ గోరువార్తలు చూస్తూ కాలం గడిపేస్తున్నది” సమర్థ గాధ వినిపించారు వాళ్ళు.
గోరువార్తల ఘోరగాధ విని ఉలిక్కిపడ్డ మనోహర్‌.. చేసేదేంలేక వాళ్ళ కోరికను తీరుస్తానని అందరినీ శాంతింపజేసి పంపించేశాడు.
షషష
అనుకున్న సమాయనికి షూటింగ్‌లు పూర్తవ్వక కొంత, అనుకోకుండా కొత్త ప్రాజెక్ట్‌ ఒప్పుకున్నందుకు కొంతా, మనోహర్‌ పెళ్ళి మరో ఎన్నార్థం వాయిదా పడి గోరు వార్తాహరుల కోరిక నెరవేరింది. అతని పెళ్ళి గోరువార్తల చూట్టూ బోలెడన్ని కొత్త వీడియోలు గిరికీలు కొట్టాయి. ఇక లాభం లేదని, సుమాంజలిదేవి తొందరపెట్టి, మనోహార్‌ మనసుపడ్డ అమ్మాయితో పెళ్ళి కుదిర్చింది. అంగరంగ జరిగిన ఆ పెళ్ళి గోరువార్తల వీడియోలు.. పెళ్ళికి మూన్నెళ్ళు ముందు, పెళ్ళి తరువాత మూన్నెళ్ళు.. ప్రేక్షకులను మురిపించాయి అలరించాయి.
షషష
మనోహర్‌ పెళ్ళి జరిగి మూడు నెలలునిండాయో లేదో.. జెడ్‌ చానెళ్ళ రాకాసి గోళ్ళు బయటకు వచ్చాయి.
వాళ్ళ కెమెరాల లెన్స్‌ మళ్ళీ ముందుకు పొడుచుకువచ్చాయి. వాళ్ళ బొటనవేళ్ళ గోర్లు మరింత ఏపుగా పెరిగి.. ఏ వార్తానైనా ఎలాగైనా మార్చగల సత్తాతో వంకర్లు తిరిగాయి.
”ఆ జంట విడిపోనున్నారా…!”
”ఆ స్వామి చెప్పిందే జరగనుందా…!!”
”ఆ పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటేనా…!!!” గోరువార్తల ఘోష మొదలయ్యిందలా…
– సమ్మెట ఉమాదేవి, 9849406722