పండించడానికి నెలలు…పడేయడానికి సెకెన్లు..!

పండించడానికి నెలలు...పడేయడానికి సెకెన్లు..!సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. అటువంటి ఆహారాన్ని వృధా చేయడం బాధ్యతారహితమైన చర్య. ఆహార వ్యర్థాలు తీవ్రమైన ఆర్థిక, సామాజిక పర్యావరణ పరిణామాలతో కూడిన ప్రపంచ సమస్య. ప్రతిరోజూ తినదగిన ఆహారాన్ని టన్నుల కొద్దీ పారబ్రోస్తాం. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ఆర్థిక సవాళ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏటా ఆహారం వృథా కావడం మానవాళికి సిగ్గుచేటు. ఆహార వ్యర్థాలను తగ్గించి ఆకలితో ఉన్న వారికి అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు (తినదగిన పదార్ధాలతో సహా) ఉత్పత్తి చేయబడ్డాయి.
ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు ఆహార అభద్రతను అనుభవిస్తున్నారు. ఇది మొత్తం ఆహార పదార్ధాలలో 19 శాతంగా ఉంది. గృహాల ద్వారా రోజుకు సుమారు ఒక బిలియన్‌ భోజనం వృధా అవుతుంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదవ వంతు, సగటున ప్రతీ వ్యక్తీ 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. వృథాలో పావు శాతం ఆదా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో జీవిస్తున్న 870 మిలియన్ల మందికి ఆహారాన్ని అందించవచ్చు.ఆహార వ్యర్థాలు అంటే ఏమిటి..?తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు.
ఆహార వ్యర్థాల సూచిక 2024
యు.యన్‌.ఇ.పి – యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం మార్చ్‌ 27 తేదీన విడుదలచేసిన ఆహార వ్యర్థాల సూచిక 2024 ప్రకారం ఆహార వ్యర్థాలు 60 శాతం గృహాల నుంచి, 28 శాతం ఆహార సేవారంగం నుంచి,12 శాతం రిటైల్‌ రంగం నుండి వస్తున్నాయి. ఇవి వరుసగా 631మి.ట, 290.మి.ట, 131 మి. ట గా ఉన్నాయి.( మి.ట అంటే మిలియన్‌ టన్నులు ) ప్రపంచంలోని వార్షిక తలసరి ఆహార వృధా 132 కిలోలుగా ఉంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 12.3 అనేది 2030 నాటికి రిటైల్‌, వినియోగదారు స్థాయిలలో తలసరి ప్రపంచ ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించాలని లక్ష్యించింది. చాలా దేశాలు యస్డిజి 12.3 చేరుకోడానికి తగిన వ్యవస్థలు కలిగి లేవు. నాలుగు జి20 దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్‌, యుకె, అమెరికా) యూరోపియన్‌ యూనియన్‌ మాత్రమే 2030కి పురోగతిని ట్రాక్‌ చేయడానికి తగిన ఆహార వ్యర్థాల అంచనాలను కలిగి ఉన్నాయి. కెనడా, సౌదీ అరేబియా తగిన గృహ అంచనాలను మాత్రమే కలిగి ఉన్నాయి. బ్రెజిల్‌ అంచనా 2024 చివరిలో అంచనా వేయబడింది. ఆహార వ్యర్థాలు కేవలం సంపన్న దేశం సమస్య మాత్రమే కాదు. గృహ ఆహార వ్యర్థాల స్థాయిలు అధిక-ఆదాయ, ఎగువ-మధ్య మరియు దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో సగటున తలసరి 7 కిలోల చొప్పున తేడాను కలిగి ఉన్నాయి. తాజా ఆహార పదార్థాలను ఎక్కువగా వినియోగించడం, బలమైన కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యవస్థకు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, కరువుల వలన ఆహారాన్ని సురక్షితంగా నిలువా చేయలేకపోవడం వంటి కారణాల వలన ఉష్ణ దేశాల గృహాలలో తలసరి ఆహార వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఆహార నష్టం, వ్యర్థాలు వార్షిక గ్లోబల్‌ గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలలో 8-10 శాతం ఉత్పత్తి చేస్తున్నాయని ఇవి విమానయాన రంగం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువని ఇటీవల డేటా తెలియజేస్తుంది. పెంపుడు జంతువులు, పశువులు మొదలైనవి అందుబాటు లో ఉండడం వలన గ్రామీణ ప్రాంతాలు సాధారణ ంగా తక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నాయి. 2022 నాటికి కాబో వెర్డే, చైనా, నమీబియా, సియెర్రాతో సహా కేవలం 21 దేశాలు మాత్రమే జాతీయ వాతావరణ ప్రణాళికలు కలిగివున్నాయి. పబ్లిక్‌ ప్రయివేటు భాగస్వామ్యాలు ఆహార వ్యర్థాలు తగ్గించే ఫలితాలను అందించే ఒక ముఖ్య సాధనం.
మనదేశంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఆహారంలో దాదాపు 40 శాతం ఆహారం అసమర్థమైన సరఫరా గొలుసు వ్యవస్థ కారణంగా ప్రతి ఏడాది వృధా అవుతుంది. విడ్డూరమేమిటంటే ఆహారం వినియోగదారునికి చేరకముందే నష్టం జరుగుతుంది. భారతదేశం మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వినియోగించే దానికంటే ఎక్కువ పండ్లు కూరగాయలను వృధా చేస్తుంది. ఆస్ట్రేలియా ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ ధాన్యాలను వృధా చేస్తుంది. జీడీపీలో దాదాపు ఒక శాతం ఆహార వృధా రూపంలో క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయబడిన రూ.50వేల కోట్ల విలువగల ఆహారం వృధా అవుతుంది. దేశంలో దాదాపు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. జనాభాలో 15శాతం మంది ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లలలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దాదాపు 3వేల మంది ప్రతిరోజు సరైన ఆహారం లేని కారణంగా అనారోగ్యంతో మరణిస్తున్నారు.ఆహార వ్యర్థాలు ప్రధానంగా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, నిల్వ సమయాలలో జరుగుతుంది. ఇండ్లలో , వివాహాలు, పార్టీలు జరిగేటప్పుడు, హోటల్స్‌లో, ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన ఆహారంలో మూడింట ఒక వంతుకు పైగా వృధా అవుతుందని అంచనా వేయబడింది.
జీవ పర్యావరణాలపై ప్రభావం
ఆహారం ఉత్పత్తి చేయడానికి మంచి నీరు, భూమి, శ్రమ అవసరం. ఆహారాన్ని వృధా చేసామంటే వీటిని కూడా వృధా చేసినట్లే…! ఈ వినియోగించని ఆహార పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా 8-10శాతం కార్బన్‌ ఉద్గారాలకు కారణమవుతున్నాయి. ఇవి ప్రతి సంవత్సరం పర్యావరణంలోకి 3.3 బిలియన్‌ టన్నుల గ్రీన్హౌస్‌ వాయువులును విడుదల చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో కుళ్లిన ఆహారాల నుంచి విడుదలయ్యే మీథేన్‌ కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే మరింత శక్తివంతమైన గ్రీన్‌హౌస్‌ వాయువు. ఇది మానవాళికి క్యాన్సర్‌, శ్వాసకోశవ్యాధులు వంటి వ్యాధులు రావడానికే కాకుండా అంగ వైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారకం కూడా. ఆహార వ్యర్థాలు కుళ్ళడం వలన విడుదలయ్యే 10శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులు ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నాయి. ఇంకా పర్యావరణ పరంగా మొక్కలు జంతుజాతుల క్షీణత జరిగి దాదాపు 70శాతం జీవ వైవిధ్య నష్టానికి ఈ ఆహారవ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి. చెత్తాచెదారం పల్లపు ప్రదేశాల్లోకి వెళ్లడం వలన నీటి కాలుష్యం జరుగుతుంది.
ఆహార వృధాను ఎలా తగ్గించాలి?
పోషకమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థను కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైన పరిమాణంలో ఆహారాన్ని కొనుగోలు చేయాలి. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించడం, అదనపు ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం, ఫుడ్‌ బ్యాంకులకు పంపించడం మొదలైనవి చేయాలి. ఆహార వ్యర్థాలు మట్టిని పోషకాలతో సుసంపన్నం చేస్తాయి కావున మిగిలిన ఆహార వ్యర్థాలను కంపోస్టింగ్‌ చేయాలి. ఒక ఇంటి కంపోస్టింగ్‌ ద్వారా 150 కిలోల వరకు ఆహారవ్యర్థాలను నివారించవచ్చు. పండ్లు వంటి వాటిని నిలవచేయడానికి శీతల గిడ్డంగులును నెలకొల్పాలి. నిలవకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలి.
జనక మోహన రావు
8247045230a