– ప్రతి పక్షాల కుట్రలకు ప్రక్షాళన ఆగదు : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ అభివృద్ధి భావితరాలకు ఎంతో అవసరమని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ చెప్పారు. ప్రతిపక్షాల కుట్రలకు మూసీ ప్రక్షాళన ఆగబోదని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మూసీ మురికి కంటే ప్రతి పక్షాల మురికి ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. వారి మనస్సులను శుభ్రం చేసి తీరుతామని చెప్పారు. మూసీకి ఉమ్మడి నల్లగొండకు ఎంతో అనుబంధముందని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నుంచి మూసీ శుద్ధి అయితే అక్కడి ప్రజల తలరాత మారుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి అయివుండి మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏనాడైన మూసీ పక్కన నివసించావా? అని ప్రశ్నించారు. బాధితులను ఈటల రెచ్చగొట్టడం విచారకరమన్నారు. బాధితుల భవిష్యత్తు, భరోసా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల దుష్ప్రచారన్ని తిప్పి కొట్టాలని కోరారు. గత ప్రభుత్వంలో తమ స్వార్ధ ప్రయోజనాలకు అధికారులను ఉపయోగించు కున్నారని విమర్శించారు. మూసీ దుస్థితిపై పదేండ్లలో ఏనాడైన కేటీఆర్ పర్యటించారా? అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతుందన్నారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడే పార్థీలను ప్రజలు తరిమి కొట్టాలనీ, అందుకు యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు.