– క్రెడెర సీఈఓ కెవిన్ మెక్‌డొనాల్డ్ వెల్లడి
నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
గ్లోబల్ డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ ఓమ్నికామ్స్‌కు చెందిన క్రెడెర భారత్‌లో తనకు ఆరు సెంటర్లు ఉన్నట్లు తెలిపింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రెడెర సీఈఓ కెవిన్ మెక్‌డొనాల్డ్స్, ఇండియా సీఈఓ గౌరవ్ మథూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో తమకు హైదరాబాద్, కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నయ్, భువనేశ్వర్, గూర్‌గావ్‌లో జిసిసి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోనూ ఓ శాటిలైట్ సెంటర్‌ను నడుపుతున్నామన్నారు. కాగా.. అమెరికా బయట హైదరాబాద్‌లో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద జీసీసీ సెంటర్‌ను కలిగి ఉన్నామన్నారు. ఇందులో 1000 మంది పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. ఈ సెంటర్‌పై మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులను తీసుకోనున్నామని చెప్పారు. 21 దేశాల్లో తాము కార్యకలాపాలను కలిగి ఉన్నామని.. 3,000 పైగా ఉద్యోగులు ఉండగా.. ఇందులో 1300 మంది ఇండియాలో పని చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి అన్ని సెంటర్లు విదేశాల్లోని తమ క్లయింట్లకు సర్వీసును అందిస్తున్నాయన్నారు. తమ సంస్థల్లో ఫ్రెషర్స్ టెకీలకు కనీస వార్షిక వేతనం రూ.5 లక్షల నుంచి ఇస్తున్నామన్నారు. బిఎఫ్‌ఎస్, ఫార్మా, ఎనర్జీ తదితర రంగాల్లోని కంపెనీలకు టెక్ సేవలను అందిస్తున్నామన్నారు.