కొన్నదానికంటే.. కోసినందుకే ఎక్కువ…

వేడి వేడి అన్నంలో ముద్ద పప్పేసుకుని, అందులో కొత్తావకాయ కలుపుకుని, కాసింత నెయ్యి పోసుకుని తింటే.. నా సామిరంగా… ఆ టేస్టే వేరబ్బా. వింటేనే నోరూరిపోతోంది కదా.. అలాంటిది తింటే ఇంకెంత బాగుంటుందో. ఇలా నోరూరించే ఆవకాయ… ఇటీవల ధరలతో మాత్రం జనాన్ని బెంబేలెత్తించింది. ఏ మార్కెట్‌లో చూసినా జనాలు ఎగబడి కొనటంతో ఒక్కో మామిడికాయ ధర రూ.10 నుంచి రూ.25 దాకా (నాణ్యను బట్టి) పలికింది. హైదరాబాద్‌ నల్లకుంటలోని కూర గాయల మార్కెట్‌లో కొత్తావకాయకు మస్తు గిరాకీ వచ్చి పడింది. ఓ మధ్య వయస్కురాలు ఆ మార్కెట్‌ గుండా వెళుతూ ఓ దుకాణం వద్ద ఆగింది. ఆమె చేతిలో ఓ సంచీ. అందులో ఓ ఇరవై దాకా పచ్చడి మామిడికాయలున్నాయి. ఆ షాపు వద్దకు వెళ్లిన ఆమె…’బాబూ… నా దగ్గర కొన్ని మామిడి కాయలున్నాయి. వాటిని కోసి పెట్టాలి. ఎంతో కొంత డబ్బులిస్తాను. ఈ పని చేసి పెట్టు…’ అని అక్కడి యువకుణ్ని అడిగింది. దానికి అతడు… ‘తప్పకుండా ముక్కలు కోసి పెడతా… కానీ ఒక్కో కాయకు రూ.15 ఇవ్వు…’ అంటూ డిమాండ్‌ చేశాడు. దానికామె సీరియస్‌ గా… ‘ఓర్నాయనో.. ఒక్కో కాయకు రూ.12 పెట్టి కొన్నా. కానీ ఆ కాయను కొయ్యటానికే నువ్వు రూ.15 అడుగు తున్నావే…అంటే కాయ కొన్నదానికంటే, కోసినందుకే రేటెక్కు వన్నమాట…’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. అక్కడున్న వాళ్లు కూడా అతగాడి మీద ఎగబడటంతో చివరకు ఒక్కో కాయకు రూ.5 తీసుకుని, ముక్కలు కోసిచ్చాడు. అదీ మేటర్‌…
-బి.వి.యన్‌.పద్మరాజు