మెట్టా నాగేశ్వరరావు ‘మనిషొక పద్యం’ కవితా సంపుటితో తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితుడు. వచనకవిత్వం కంటే ముందుగానే రుబాయిలు పుస్తకంగా వేశారు. ఈ మధ్యకాలంలో ‘నేను -కొన్ని సూఫీ సమయాలు’, ‘ఒక ముసాఫిర్ ఆత్మగీతం’ పేరుతో రెండు కవితాసంపుటులు వెలువరించారు. మనిషొక పద్యంలో పల్లె చుట్టూ ఉన్న జీవిత విశేషాలను, తమ అస్తిత్వాన్ని, బహుజన దక్పథాన్ని కవిత్వంలోకి పట్టుకొచ్చి కవిత్వం చేశాడు. తాజాగా వెలువరించిన కవితాసంపుటుల్లో తనను తాను కనుగొనే ప్రయత్నంలో సూఫీ తత్వాన్ని సంతరించుకున్నాడు. ఏ కవికైనా ఇలాంటి మార్పు అవసరమే. మొనాటనీ లేకుండా కవితాసంపుటుల మధ్య ఇలాంటి పరిణామ క్రమం ఆశించదగినది. కవి తాత్వికత వైపుగా వెళ్తున్నాడంటే ఇంకో మెట్టు పైకి వెళ్ళబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. మనిషి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తే గాని అంతుచిక్కదు. కవిత్వాన్ని కొలమానంగా పెట్టుకొని ఈ కవి చేస్తున్న ప్రయత్నం గమనించదగ్గది. చాలా వేగంగా కవిత్వం చేయటం ఈ కవికున్న అదనపు బలం కూడా.
‘నేను కొన్ని సూఫీసమయాలు’లో వీరు రాసిన ఒక్కటిలో మరొక నీడ’ ఎంతో తాత్వికతను, మనోవైజ్ఞానికతను నింపుకున్న కవిత. శీర్షికే చాటుమాటున దాగిన మరో ప్రపంచాన్ని బయటపెడుతుంది. చూసేవన్నీ నిజాలు కావు. మనుషులను నిలబెట్టె అబద్దాలెన్నో వాటి వెనుక దాగి ఉంటాయి. పైకి ఒక రంగు కనబడుతుంది. లోపల పురుగులే ఉండొచ్చునేమో.
కవి పెట్టిన ‘శీర్షిక’ ఇలాంటి మరెన్నో ఊహలకు తావిస్తుంది. పరస్పర వైరుధ్య భావాలను ఉపయోగిస్తూ రాసిన ఈ కవిత ఒక ఆలోచనలోంచి మరో ఆలోచనలోకి దారులు తెరుస్తుంది.
మనకు సమాజమంతా కాంతివంతంగా కనబడుతుంది. అంతా బాగా కనబడుతున్న ఈ కాంతి వెనుక ఎన్నో సమిధలున్నాయి. అందుకే తాజ్‌మహల్‌కు రాళ్ళెత్తిన కూలీలెవరోరు? అనే శ్రీశ్రీ మాట గుర్తుకొస్తుంది. ఎత్తుగడలో కవి ప్రయోగించిన వాక్యాలు ఈ కోవలోనివే. వాక్యాలు రెండే. విస్తతమైన అర్థంలోకి మనల్ని తీసుకెళ్ళగల భారత్వం ఇందులో కనిపిస్తుంది.
ఎంతటి ఎత్తులకు పొయినా మనిషికి పరీక్ష ఉంటుందని సినారె అంటారు. చాలా గొప్పస్థాయికి వెళ్ళిన మనిషిలో కూడా ఎన్నో నిరాశలుంటాయి. చింతలుంటాయి. ఒడిదొడుకులుంటాయి. ఒక్కోసారి కిందికి జారిపడే అవకాశాలు లేకపోలేదు. చాలా తక్కువ స్థాయిలో జీవించేవాడిలో ఉన్నతమైన ఆలోచనలుండొచ్చు. మనిషిని గౌరవించే తీరులో, మాట్లాడే తీరులో ముందంజ వేయొచ్చు. కవి రాసిన ఈ పంక్తుల్లోంచి ఎన్నో, ఇంకెన్నో విషయాలను మనం ఒడిసిపట్టుకోవచ్చు. ”ఎత్తులో పతనాలుంటాయి/ లోయల్లో ఉన్నతులుంటాయి” అని రాసిన వాక్యాలు కవిచూపు ఎంత బలమైనదో పట్టిస్తుంది. ఒక కవిత చదివితే అందులోంచి కొన్ని వేల భావాలు పుట్టాలి అన్నట్టుగా ఈ కవితలోంచి కూడా కావాల్సిన భావాలెన్నో మనల్ని చుట్టుముడుతాయి. కవి వాడిన ప్రతీకలు ఇప్పటి సమాజ పరిస్థితులకు పొసిగాయి.
మనిషి మనస్తత్వానికి అద్దం పట్టిన కవిత ఇది. విశాలతకు, ఇరుకుతనానికి సంబంధించి కవి బహుమతిగా ఇచ్చిన వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. ‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే ఓ సామెతను గుర్తుచేస్తుంది. ఇంకో స్టాంజాలో తెల్లచొక్కా వెనుక దాగియున్న క్రూరమైన మనసును బయటి లాగి మనముందు పరిచాడు. చిరిగిపోయిన చొక్కా వేసుకున్న పేదవాడి మనసులోని శుభ్రతను గుర్తు చేశాడు. ఈ కవిత మూలాంశం చాలా లోతైనది. ప్రపంచమంతా తిప్పించుకొస్తుంది.
మనిషి ముందో మాట, వెనుకో మాట మాట్లాడుతున్న మనుషులెందరో మనకు తారాసపడుతారు. వాళ్ళంతా ఇందులో ఉన్నారు. వారి వారి ప్రయోజనాల కోసం ఎన్నో అడుగులు ముందుకేస్తారు. అవసరమొస్తే ఆ అడుగులను నెత్తిన పెట్టుకుంటారు కూడా. నిజం నిలకడగా తెలుస్తుందంటారు. ఎవడు నిజమో, ఎవడు అబద్దమో తెలిసేదాక వేచి చూడాల్సిందే. కవి చెప్పిన విజయం, అపజయాల మధ్య ఉన్న తేడా కనువిప్పు కలిగించేది. గెలవటం అంటే గెలిపించుకోవటం. గెలుపుదిశగా వెళ్తున్న వాడిని ఓడగొట్టడం అనే సారాంశంలో రాసిన ఆ వాక్యాలు ఇప్పటి వ్యవస్థలను తూకం వేసి మాట్లాడినవి. ఈ కవిత గూర్చి ఇంకెన్నో విషయాలు చర్చకు పెట్టొచ్చు. ఎంత మాట్లాడినా సమాచార జోడింపు తక్కువే అవుతుందేమో.
మెట్టా నాగేశ్వరరావు ఈ కవిత ఒక్కటే కాదు, ఈ కవితా సంపుటిలోని ప్రతీ కవితలో తత్వాన్ని జోడించాడు. సూఫీ తత్వమంటేనే నిరాడంబరత. అది కొంతకాలానికే అబ్బదు. ఎన్నో మోహాలను కాల్చి బూడిదచేసుకుంటే తప్ప సూఫీలా మిగలడు. ఆ వైపుగా అడుగులేస్తూ తనను తాను చెక్కుకుంటున్న ఈ కవి, తన పంథాను మార్చుకొని కొత్త వైపుగా అడుగులేశాడు. మూసలోంచి బయటపడటమనేది కవికి ఉండాల్సిన ముఖ్యలక్షణం. ఆ మూసలోంచి బయటపడ్డ ఈ కవి ఇలాగే వేగాన్ని నియంత్రించుకుంటూ సాగితే ఇంకెన్నో ప్రయోగాలు చేయగలడు.
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551
ఒక్కటిలో మరొక నీడ
వెలుగులో చీకటుంది
చీకటిలోనూ వెలుగుంది
పారడాక్సుని వేరుజేసే హంసే లేదు
ఎత్తుల్లో పతనాలుంటాయి
లోయల్లో ఉన్నతులుంటాయి
ప్రతీకలు పొసగవు ఒక్కోసారి
మైదానంలో నిలబడ్డ మనిషి
ఇరికిరుకుగా ఆలోచిస్తాడు
ఇరుకుసందులో నడిచే వాడిలో
సముద్రమంత విశాలమది
ఇదే ఇలాగే అనీ
ఇతమిద్దంగా ఏదీ చెప్పేయలేం
కుండలో అమతం దాయొచ్చు
విషాన్నీ నింపొచ్చు
మబ్బు వాగుల్ని పరిగెట్టించొచ్చు
మబ్బు కరువుని కురవొచ్చు
పాములన్నీ ప్రమాదకారులు కాదు
చెట్లన్నీ ఫలించవు
చదివిన మనిషికి శంకలెక్కువ
పగలే జారిపడే నడకలెన్నో
తెల్లచొక్కాలకింద నల్లమనసు
చిరిగిన చొక్కాల మది శుభ్రరాజం
గతుకులదారిలోనే సుఖప్రయాణం
అద్దాల్లాంటి తార్రోడ్లపై రక్తబీభత్సాలు
నిజాల్లో అబద్దాల ఛాయలు
అబద్ధాల్లో వాస్తవాల సడులు
ఎత్తుమనిషిలో కురూపితనం
పొట్టిమనిషిలో శిఖరతత్వం
చూసే దశ్యాల్లో కనుమాయలుంటాయి
సమ్మేవాటినే అవిశ్వాసాలుంటాయి
గెలుపుల్లో ఓటములుంటాయి
ఓటముల్లో విజయాలుంటాయి
కాలంలో అకాలం వుంటుంది
కవిత్వంలో అకవిత్వమూ వుంటుంది
నిశితంగా చూసినపుడే
దూరంగా వున్న కొండలు
నునుపు కాదని తెలుస్తుంది
మేకప్పు మనిషిలో అసహజత్వం తేటపడుతుంది.
– మెట్టా నాగేశ్వరరావు