– చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ కార్యదర్శి మిస్రి భేటీ
బీజింగ్ : ప్రస్తుతం బీజింగ్‌లో అధికార పర్యటనలో వున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు. ఇరు దేశాలు పరస్పర అవగాహనను, మద్దతును పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని వాంగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరస్పర అనుమానాలు, విభజన వంటి చర్యలకు కూడా ఇరు దేశాలు దూరంగా వుండాలని వాంగ్ పేర్కొన్నట్లు మీడియా పేర్కొంది. మిస్రి మాట్లాడుతూ, ఇరు దేశాలు వివిధ రంగాల్లో విభేదాలను పరిష్కరించుకుంటూ, ఆచరణాత్మక సహకారాన్ని పెంచుకుంటూ చర్చలు, సమాచార మార్పిడి ద్వారా లబ్ది పొందుతున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనాతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు తమ వైపు నుండి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఆదివారం బీజింగ్ చేరుకున్న మిస్రి పలువురు ఉన్నతాధికారులతో, పాలక కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు కుదుర్చుకున్న కీలకమైన ఏకాభిప్రాయాన్ని సంయుక్తంగా అమలు చేయడం ఉభయ పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. చర్చల ప్రక్రియను బలోపేతం చేసుకుంటూ ఇరు దేశాల సంబంధాల సుస్థిర అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు.