ఇక సిసలైన ధనాధన్‌!

More money!– జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌
– తొలిసారి టైటిల్‌ వేటలో 20 జట్లు
– సోమవారం నుంచే వార్మప్‌ మ్యాచులు షురూ
వేసవిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) హంగామా ముగిసింది. ఇక అసలైన ధనాధన్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 నుంచి ఆరంభం కానుంది. వార్మప్‌ మ్యాచులు సోమవారమే షురూ కాగా.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 జట్లు పోటీపడుతున్నాయి. 2007 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ విజయం సాధించిన టీమ్‌ ఇండియా.. మళ్లీ పొట్టి కప్పు అందుకునేందుకు అమెరికాలో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. మరో వారంలో ఆరంభం కానున్న పొట్టి ప్రపంచకప్‌ పోరు గురించి వివరాలు..
నవతెలంగాణ క్రీడావిభాగం
టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌
2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 (స్థానిక కాలమానం ప్రకారం జూన్‌ 1)న ఆరంభం కానుంది. సుమారు నెల రోజుల పాటే టోర్నమెంట్‌ టైటిల్‌ పోరు జూన్‌ 29న షెడ్యూల్‌ చేశారు. టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ స్టేడియంలో జరుగనుంది. టైటిల్‌ పోరుకు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. టీమ్‌ ఇండియా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో కెనడాతో ఆడనుంది.
ఎక్కడ జరుగుతుంది?
ఓ ఐసీసీ టోర్నమెంట్‌కు తొలిసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యుఎస్‌ఏ) ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో కలిసి యుఎస్‌ఏ సంయుక్తంగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. గతంలో వెస్టిండీస్‌లో రెండుసార్లు ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహించారు. 2007 వన్డే వరల్డ్‌కప్‌, 2020 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మూడోసారి ఐసీసీ టోర్నీకి వేదిక కానుంది. రెండు సార్లు మహిళల టీ20 ప్రపంచకప్‌కు సైతం కరీబియన్‌ దీవులు వేదికయ్యాయి. ఇక ప్రపంచకప్‌ మ్యాచులు తొమ్మిది మైదానాల్లో జరుగనున్నాయి. డల్లాస్‌, బ్రిడ్జ్‌టౌన్‌తో పాటు ప్రావిడెన్స్‌, న్యూయార్క్‌, లాడర్‌హిల్‌, నార్త్‌ సౌండ్‌, గ్రాస్‌ ఐలెట్‌, కింగ్స్‌టౌన్‌, తరౌబాలు ప్రపంచకప్‌ వేదికలుగా నిలువనున్నాయి.
పోటీపడుతున్న జట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఏకంగా 20 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య దేశాలు అమెరికా, వెస్టిండీస్‌ సహా 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు ఆటోమెటిక్‌ అర్హత ప్రక్రియలో వచ్చాయి. యూరోపియన్‌ క్వాలిఫయర్‌ నుంచి ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌.. అమెరికాస్‌ క్వాలిఫయర్‌ నుంచి కెనడా.. ఆసియా క్వాలిఫయర్‌ నుంచి నేపాల్‌, ఓమన్‌… ఆఫ్రికా క్వాలిఫయర్‌ నుంచి నమీబియా, ఉగాండా.. ఈస్ట్‌ ఆసియా పసిఫిక్‌ క్వాలిపయర్‌ నుంచి పాపావా న్యూగినీ అర్హత సాధించాయి.
ప్రపంచకప్‌ పోటీ ఫార్మాట్‌
ప్రపపంచకప్‌లో పోటీపడుతున్న 20 జట్లు తొలుత ఐదు గ్రూపులుగా విడిపోతాయి. ప్రతి గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచుల్లో పోటీపడాల్సి ఉంటుంది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌ ఎయిట్‌ దశకు చేరుకుంటాయి. ఇక్కడ మళ్లీ ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు మూడు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌-ఏలో కెనడా, ఐర్లాండ్‌, భారత్‌, పాకిస్థాన్‌, యుఎస్‌ఏలు ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, నమీబియా, ఓమన్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌-సిలో అఫ్గనిస్థాన్‌, న్యూజిలాండ్‌, పాపావా న్యూగినీ, ఉగాండా, వెస్టిండీస్‌… గ్రూప్‌-డిలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు చోటుచేసుకున్నాయి.
వర్షం పడితే రిజర్వ్‌ డే ఉందా?
ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్‌ టైగా ముగిసినా.. ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు. సూపర్‌ ఓవర్‌ టై అయినా.. ఫలితం వచ్చే వరకు మళ్లీ ఆడిస్తారు. ఇక గ్రూప్‌ దశలో, సూపర్‌ ఎయిట్‌ దశలో వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఇరు జట్లు పాయింట్లు సమంగా పంచుకుంటాయి. నాకౌట్‌ దశలో మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు కనీసం ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు ఆడాల్సి ఉంటుంది. ఇక గ్రూప్‌ దశ, సూపర్‌ ఎయిట్‌ మ్యాచులకు రిజర్వ్‌ డే లేదు. నాకౌట్‌ దశలోనూ కేవలం తొలి సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే కేటాయించారు. ఫైనల్స్‌కు, రెండో సెమీఫైనల్‌కు ఒక్క రోజే విరామం ఉండటంతో రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే ఇవ్వలేదు. డ్రా ప్రకారం భారత్‌ సెమీఫైనల్స్‌కు చేరుకుంటే రెండో సెమీస్‌లో తలపడనుంది. తొలి సెమీస్‌కు మ్యాచ్‌ రోజు ఫలితం తేల్చేందుకు అదనంగా 190 నిమిషాల సమయం కేటాయించగా.. రెండో సెమీఫైనల్‌కు 250 నిమిషాల సమయం కేటాయించారు. రెండో సెమీస్‌లో వాతావరణ అంతరాయంతో మ్యాచ్‌ నిలిచిపోతే ఫలితం తేల్చేందుకు మ్యాచ్‌ రెగ్యులర్‌ షెడ్యూల్‌ సమయాని కంటే అదనంగా నాలుగు గంటలకు పైగా వేచి చూస్తారు.
చాంపియన్లుగా నిలిచిన జట్లు
ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు జట్లు టైటిల్‌ అందుకున్నాయి. తొలి టీ20 ప్రపంచకప్‌ (2007)లో టీమ్‌ ఇండియా విజయం సాధించింది. కానీ ఆ తర్వాత మళ్లీ టైటిల్‌ అందుకోలేదు. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మాత్రమే రెండేసి సార్లు పొట్టి ప్రపంచకప్‌ చాంపియన్లుగా నిలిచాయి. ఇంగ్లాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. టీ20 ప్రపంచకప్‌ మాజీ చాంపియన్లు.. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), వెస్టిండీస్‌ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్‌ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లాండ్‌ (2022).