– ఐపీఎల్ వేలంపై ఆటగాళ్ల గురి
– భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడు
– రాత్రి 8.30 నుంచి స్పోర్ట్స్18లో..
స్వదేశంలో ఊహకందని 0-3 టెస్టు సిరీస్ వైట్‌వాష్ ఓటమి చవిచూసిన టీమ్ ఇండియా.. సఫారీ గడ్డపై ధనాధన్ సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం సమీపిస్తుండగా ఇరు జట్ల ఆటగాళ్లు వేలంపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న టీమ్ ఇండియాకు దక్షిణాఫ్రికా కఠిన సవాల్ విసిరేందుకు రంగం సిద్ధం చేసింది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 పోరు నేడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా తొలిసారి ముఖాముఖి ఢీకొట్టనున్నాయి.
నవతెలంగాణ-డర్బన్
మరో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల మెగా వేలం ఉండగా.. ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. భారత్, దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ నేడు డర్బన్‌లో తొలి టీ20తో ఆరంభం కానుంది. భారత జట్టులోని 15 మందితో 11 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి అత్యధిక మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. దీంతో నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌కు ఇతర ప్రాధాన్యతలు లేకపోయినా.. ఐపీఎల్ వేలంతో మైదానం వేడెక్కనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రిటెన్షన్ ధర దక్కించుకున్న హెన్రిచ్ క్లాసెన్‌ను టీమ్ ఇండియా ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 రాత్రి 8.30 గంటలకు ఆరంభం కానుంది. స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్‌ను చూడవచ్చు.
కుర్రాళ్లకు సవాల్
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ స్థానం కోసం ఇద్దరు బ్యాటర్లు పోటీపడుతున్నారు. తొలి ప్రాధాన్య ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ టెస్టు జట్టుతో ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు మరోసారి ఓపెనర్లుగా రానున్నారు. ఐపీఎల్ 2024లో పవర్‌హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం రచించిన అభిషేక్ శర్మ ఆ స్థాయి జోరు అంతర్జాతీయ వేదిక కనబరచలేదు. రెండో టీ20లోనే సెంచరీ సాధించినా.. ఆ తర్వాతి ఇన్నింగ్స్‌ల్లో చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. సంజు శాంసన్ సైతం ఈ ఏడాది 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా మూడు సార్లు డకౌట్‌గా నిష్క్రమించాడు. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో కండ్లుచెదిరే సెంచరీ సాధించిన సంజు శాంసన్ అదే జోరు కొనసాగించేందుకు చూస్తున్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించే సంజు.. జాతీయ జట్టు తరఫున ఆ స్థాయిలో రాణించటం లేదు. జైస్వాల్, గిల్ వచ్చినా.. జట్టు ప్రణాళికల్లో నిలవాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సంజుతో పాటు అభిషేక్ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో పాటు హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో బెర్త్ కోసం రమణ్‌దీప్ సింగ్ ఎదురుచూస్తున్నాడు. యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ సైతం తుది జట్టులో అవకాశం ఆశిస్తున్నాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ బృందాన్ని నడిపించనున్నాడు. అవేశ్ ఖాన్, యశ్ దయాల్, విజరుకుమార్ వైశాక్‌లు పేస్ విభాగంలో ఉన్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోరు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఉత్సాహంగా సఫారీలు
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ఫేవరేట్‌గా కనిపిస్తుంది. టీ20 ఫార్మాట్‌లో భీకర గణాంకాలు కలిగిన ఆటగాళ్లు సఫారీ బృందంలో ఉన్నారు. కెప్టెన్ ఎడెన్ మార్‌క్రామ్ సహా డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్, పేస్‌ను సమర్థవంతంగా బాదగల విధ్వంసకారుడు హెన్రిచ్ క్లాసెన్ సఫారీలకు ఎక్స్ ఫ్యాక్టర్. టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు పొట్టి ఫార్మాట్‌లో తలపడనుంటం ఇదే తొలిసారి. దీంతో సహజంగానే సఫారీలు ప్రతీకార విజయం కోసం ఎదురుచూస్తున్నారు. కగిసో రబాడ అందుబాటులో లేకపోయినా.. మార్కో జాన్సెన్ పేస్ బృందానికి నాయకత్వ వహిస్తున్నాడు. పీటర్, క్రూగర్, గెరాల్డ్ కోయేట్జిలు పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. కేశవ్ మహరాజ్ స్పిన్ మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.
పిచ్, వాతావరణం
కింగ్స్‌మీడ్ డర్బన్ పిచ్ సంప్రదాయ పేస్ పిచ్. ఇక్కడి పిచ్‌పై తేమ సీమర్లకు అదనపు సీమ్, పేస్ అందిస్తుంది. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లకు సైతం మేలు చేసే విధంగా పిచ్ రూపకల్పన చేస్తారు. డర్బన్‌లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 153 పరుగులు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు. ఇక్కడ 18 టీ20లు జరుగగా.. 8 మ్యాచుల్లో ఛేదించిన జట్టు, 8 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయాలు సాధించాయి. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 226, అత్యల్ప స్కోరు 73. శుక్రవారం మ్యాచ్‌కు వర్షం ప్రమాదం పొంచి ఉంది. నేడు 40 శాతం వర్షం కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తుది జట్లు (అంచనా) :
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, జితేశ్ శర్మ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్, ఎడెన్ మార్‌క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, సిమెలేన్, పీటర్, బార్ట్‌మాన్, కేశవ్ మహరాజ్.