– 5శాతం వృద్ధిరేటు లక్ష్యం : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : కొత్త సంవత్సరంలో మరింత క్రియాశీలమైన సూక్ష్మ ఆర్థిక విధానాలను చైనా అమలు చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపిచ్చారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఉన్నత రాజకీయ సలహా మండలినుద్దేశించి ఆయన ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుండి బయటపడేందుకు దేశం ఈ ఏడాది చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే బలహీనంగా వున్న వినిమయం, పెరుగుతున్న ప్రభుత్వ రుణ భారం కూడా పెను ముప్పులుగా తయారయ్యాయన్నారు. ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఇటీవలి మాసాల్లో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందన్నారు. వడ్డీరేట్లలో కోత, ఇళ్ళ కొనుగోలుపై ఆంక్షలను రద్దు చేయడం, స్థానిక ప్రభుత్వాలపై రుణా భారాన్ని సడలించడం వంటి చర్యలు అమలు చేసిందన్నారు. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పూర్తి స్థాయిలో జరగాలంటే దేశీయ వినిమయం పెరగడం అవసరమని, దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మరింత ప్రత్యక్ష ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టాలని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది 5శాతం జాతీయ వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించగలమని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, అయితే ఆర్థికవేత్తలు మాత్రం లక్ష్యసాధనలో వెనుకబడవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది 4,8శాతం మేరా వచ్చే ఏడాది 4.5శాతం మేరా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ”మనం తప్పనిసరిగా సమగ్రంగా సంస్కరణలను అమలు చేయాల్సిన అవసరం వుంది. ఉన్నత స్థాయిలో అవకాశాలను విస్తరించాలి. అభివృద్ధిని, భద్రతను మరింత మెరుగైన రీతిలో సమన్వయం చేయాలి.మరింత క్రియాశీలమైన, సమర్ధవంతమైన సూక్ష్మ ఆర్థిక విధానాలను అమలు చేయాలి.” అని జిన్‌పింగ్ పిలుపిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియా వార్త్లలను ప్రసారం చేసింది.