– వికలాంగుకలు రూ.వెయ్యి పెంపు అమలు
– జిల్లాలో 31609 మందికి ప్రయోజనం
నవతెలంగాణ-నల్గొండ
వికలాంగుల పెన్షన్ అదనంగా పెంచిన రూపాయలు వెయ్యి అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు వారు ప్రతినెల రూపాయలు రూ.3016 తీసుకోగా ప్రస్తుతం రూ.4016లు అందుకున్నారు.జిల్లావ్యాప్తంగా 31609 మంది వికలాంగులకు ప్రయోజనం చేకూరింది. జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాలు 211665 మంది పింఛన్‌దారులు ఉండగా ఇందులో 31609 మంది వికలాంగులు ఉన్నారు. వీరికి ప్రతినెల ఒక్కొక్కరికి రూ.3016 చొప్పున రూ.9.53 కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం మరో రూ.1000 పెంచడంతో రూ.3.19 కోట్లు అదనంగా కేటాయించింది. దీంతో ప్రతినెలా అన్ని రకాల పింఛన్లకు కలిపి దాదాపు రూ.56.60 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
పెరగనున్న దరఖాస్తులు..?
వికలాంగులకు ప్రతినెల రూ.3016 లు పింఛన్‌తో పాటు బస్సు, రైలు ప్రయాణాల సౌకర్యం ఉంది. ప్రభుత్వ నుంచి వివిధ రకాల రాయితీ రుణాలు వస్తుండడంతో చాలామంది సదరం ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 40 శాతం పై ఉంటేనే పింఛన్ తో పాటు అన్ని రకాల రాయితీలు వస్తాయి. అయితే చాలామంది అనర్హులు సైతం తమకు ధ్రువపత్రం కావాలని సదరం శిబిరాలకు వస్తున్నారు. వారితో అన్ని రకాల విభాగాలలో కలిపి అర్హులను పరిశీలిస్తే సగటున మొత్తం ఆసుపత్రికి వచ్చిన పాలలో 50 శాతం మంది మాత్రమే అర్హులు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మిగతా వారంతా ప్రభుత్వ రాయితీ రుణాలు, బస్సు, రైలు పాసుల కోసం వస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం పింఛను 4016 వస్తుందని తెలియడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గతంలో అనర్హులకు సదరం ధ్రువపత్రాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో అనర్హులను తొలగించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇతర పింఛన్లు పెంపు యోచనలో…
ఆసరా పింఛన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్ పెంచగా ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర పించన్దారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2016 రూపాయల పింఛన్ ఇస్తోంది. వీరందరికీ వెయ్యి రూపాయలు పెంచి రూ.3016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపిన విషయం విధితమే. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్దిదారులకు త్వరలో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ఇటీవల సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలలో సంతోషం వ్యక్తం అవుతుంది.
నల్లగొండ జిల్లాలో పింఛన్లు…
నల్లగొండ జిల్లాలో మొత్తం 211665 పింఛన్లు ఉండగా వారికోసం ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం రూ.56. 60 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. మొత్తం పింఛన్లలో విభాగాల వారిగా చూస్తే వద్ధాప్య పింఛన్లు 75,942 ఉండగా వికలాంగుల పింఛన్లు 31 069, వితంతువు పెన్షన్లు 81797, చేనేత పెన్షన్లు 3120, గీత పింఛన్లు 8093, ఒంటరి మహిళలకు పింఛన్లు 77 33, హార్ట్ పింఛన్లు 2076, బోదకాల పింన్షన్లు 1086, డయాలసిస్ పెన్షన్లు 209 ఉన్నాయి.