– కొత్త సంవత్సరం రోజునా ఆగని దాడులు
– శిధిలాల కుప్పలుగా నివాస ప్రాంతాలు
గాజా : కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కూడా గాజాపై వరుసగా శతఘ్ని, క్షిపణి దాడులు కొనసాగుతునే వున్నాయి. గత 24గంటల్లో 200మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా పాత బస్తీలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. గ్రేట్ ఒమరి మసీదు, పాత మార్కెట్ వంటి ప్రాంతాలు శిధిలాల కుప్పలుగా మారాయని ఆ ప్రాంతంలో పర్యటించిన విలేకరి తెలిపారు. పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడిలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఇజ్రాయిల్ మిలటరీ కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ఖాన్ యూనిస్ నగరంపై గత కొద్ది గంటలుగా శతఘ్ని దాడులు కొనసాగుతునే వున్నాయని ఆ విలేకరి తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం నివాస ప్రాంతాలను వరుసగా ధ్వంసం చేసుకుంటూ సైన్యం ముందుకు సాగుతోందని, ఇప్పటికే వందలాది గృహాలు నేలమట్టమయ్యాయని, దీంతో ప్రజలు దక్షిణ ప్రాంతాల వైపుకు వలస వెళ్ళిపోతున్నారని జర్నలిస్టు అబూ అజూమ్ తెలిపారు. ప్రజలను బలవంతంగా ఇలా తరలించడమనేది మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అధికారి ఫ్రాన్సెస్కా అల్బనీస్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తరబడి అక్రమంగా కొనసాగిస్తున్న ఆక్రమణలకు పరాకాష్టగా ఈ దాడులు చేపడుతోందని అన్నారు. బాంబు దాడులు, ఆకలి చావులను ఎదుర్కొనడం, వ్యాధులు వంటి వాటితో ప్రజలు బెంబేలెత్తుతున్నారని, కొత్త ప్రాంతాలకు తరలిపోతున్నారని అన్నారు. ఇజ్రాయిల్ శవాగారాల్లో 450మంది పాలస్తీనియన్ల మృతదేహాలు పడివున్నాయని, వాటిని ఇజ్రాయిల్ ఇవ్వకుండా నొక్కిపెడుతతోందని మానవ హక్కుల గ్రూపులు విమర్శిస్తున్నాయి. ఇజ్రాయిల్ నిర్బంధంలో వుంటూ మరణించిన 18మంది ఖైదీలు, 21మంది చిన్నారుల మృతదేహాలు కూడా వున్నాయి. దాదాపు మూడు మాసాలుగా జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటివరకు 22వేల మందికిపైగా మరణించారు. గాజాలోని పలు ప్రాంతాలు పెను విధ్వంసానికి గురయ్యాయి. కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా డిమాండ్లు ఎదురవుతున్నా ఇజ్రాయిల్ తన పట్టు వీడడం లేదు. పైగా కొత్త సంవత్సరంలో కూడా యుద్ధం కొనసాగిస్తామంటూ హెచ్చరికలు చేస్తోంది. రాఫా నగరం దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి వరుసగా క్షిపణి దాడులు జరిగాయి. ఉత్తర ప్రాంతంలోని జాబాలియా శరణార్ధ శిబిరంపై కూడా ముమ్మర దాడులు కొనసాగాయి. సెంట్రల్ ప్రాంతాలైన మఘజి, బురేజిల్లో, ప్రధాన ఖాన్ యూనిస్ నగరంలో కూడా పోరు కొనసాగుతునే వుంది. ఈ ఏడాది తమ జీవితాల్లోనే అత్యంత అధ్వాన్నమైన సంవత్సరమని గాజా నివాసి హమౌదా వ్యాఖ్యానించారు. కొత్తగా మొదలయ్యే ప్రతి రోజూ పాత రోజులానే బాంబుదాడులు, చావులు, మూకుమ్మడి హత్యలతో ముగుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాజా నగరం లోపల, చుట్టుపక్కల దాడులు జరిపే లక్ష్యంతో ఇజ్రాయిల్ బలగాలు తిరిగి మోహరింపునకు సిద్ధమవుతున్నాయని ఉత్తర గాజాలోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రిజర్వ్ సైనికులను కూడా రప్పిస్తున్నారు. యుద్ధం ఆరంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 85శాతం మంది ప్రజలు నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని వ్యాఖ్యానించింది.