– భారత పారా ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షులు దేవేంద్ర
– 28 నుంచి పారా ఒలింపిక్స్
పారిస్: 17వ పారా ఒలింపిక్స్‌లో భారత్ ఈసారి 25కు పైగా పతకాలు సాధించడం ఖాయమని భారత పారా ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షులు దేవేంద్ర ఝంజారియా తెలిపాడు. 2020 టోక్యో పారా ఒలింపిక్స్‌తో పోల్చిచూస్తే ఈసారి భారత్‌కు అత్యధిక పతకాలు దక్కనున్నట్లు ఆయన తెలిపాడు. 54మంది అథ్లెట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్ ఐదు స్వర్ణ, 8రజత, ఆరు కాంస్య పతకాలతో సహా మొత్తం 19 పతకాలు సాధించింది. ఈసారి 84మంది అథ్లెట్ల భారీ బృందంతో బయల్దేరిన భారత్.. సునాయాసంగానే 25పతకాల పై మార్క్‌ను అందుకోవడం ఖాయమని తెలిపాడు. గత పారా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఎనిమిది, షూటింగ్‌లో ఐదు, బ్యాడ్మింటన్‌లో నాలుగు పతకాలు దక్కాయి. టోక్యో ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భావినా పటేల్, ఆర్చరీలో హర్విందర్ సింగ్ ఒక్కో పతకం సాధించిన రికార్డు పుటల్లోకెక్కారు.
అలాగే అవని లేఖరే మహిళల ఎస్‌హెచ్-1 10మీ. ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన చరిత్ర సృష్టించింది. పారిస్ వేదికగా జరిగే పారా ఒలింపిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 4,400మంది అథ్లెట్లు పాల్గోనున్నారు.
మూడేళ్లుగా ఒలింపిక్స్‌కు సాధన..
గత మూడేళ్లుగా పారా ఒలింపిక్స్ కోసం తమ అథ్లెట్లందరూ సన్నద్ధమవుతున్నారని దేవేంద్ర తెలిపాడు. అథ్లెట్లందరూ పతకాలు సాధించగల సమర్ధులేనని, వారందరికీ ఓ ప్రణాళిక ప్రకారం శిక్షణణ పొందారని తెలిపాడు. ఇండియా గేమ్స్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టిఒపిఎస్) ప్రభుత్వ పథకం క్రింద అందించిన సౌకర్యాలపట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2028 పారా ఒలింపిక్స్‌కు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నామని తెలిపాడు.