– వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం
– అనుమానితులకు పరీక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాక్సినేషన్ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయిందని భావించిన కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే సర్కార్‌తోపాటు ప్రయివేటు ఆస్పత్రులకు పలు సూచనలు చేసింది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం హైదరాబాద్ జిల్లా నుంచే ఉంటున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో దాదాపు 30కిపైగా కేసులు నమోదయ్యాయి.
ముందస్తు అప్రమత్తం
గాంధీ, ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులతో మరో రెండు ప్రధాన ఆస్పత్రుల్లో కోవిడ్ నివారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మందులు, పీపీఈ కిట్లు, డిస్పోసబుల్ బెడ్ షీట్లు, మాస్కులు, శానిటైజర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది భద్రత, శ్రేయస్సు దృష్టా నిజాం వైద్య విధాన సంస్థ (నిమ్స్) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆస్పత్రిలో మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. తగినన్ని ఆర్టీపీసీఆర్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న కొవిడ్ టెస్టుల్లో అనుమానిత కేసులు వస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ కోవిడ్ ఐసోలేషన్ వార్డులో 50 ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలను సిద్ధం చేశారు. నిలోఫర్ సహా ఇతర అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనుమానితులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఇన్‌పేషెంట్ చికిత్స కోసం పడకలు సిద్ధం చేశారు. అవసరమైతే కొంతకాలంగా సర్వీసుకు దూరంగా ఉన్న టిమ్స్‌ను సైతం పునరుద్ధరించాలని త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
2020లో హైదరాబాద్‌లో తొలి కేసు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ 2020 మార్చి 2వ తేదీన హైదరాబాద్ నగరంలో రెడ్ హిల్స్‌లో తొలి కోవిడ్ కేసుగా నమోదైంది. మొదటి వేవ్‌లో కోవిడ్ ఆల్పా వేరియంట్ విజృంభించగా, రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్, మూడో వేవ్‌లో ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. కొత్తగా ఒమిక్రాన్ జేఎన్1 వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా వైరస్ తగ్గుముఖం పట్టిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తోంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌తోపాటు బస్తీ దవాఖాన, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలను అప్రమత్తం చేసింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 120కి పైగా ప్రయివేటు ఆస్పత్రులకు మందస్తు సమాచారం ఇచ్చారు. కరోనా విజృంభిస్తే బెడ్లు, మందులు, వెంటిలేటర్లు, ఐసోలేషన్ వార్డులు, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో మాక్ డ్రీల్ నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండాలి.. ఆందోళన అవసరం లేదు
డాక్టర్ రఘునాథస్వామి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసులు పెరుగుతున్న దృష్టా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానలో పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. పూర్తి స్థాయిలో వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఐదుగురికి కరోనా పాజిటివ్
– జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని ఒకే కుటుంబంలో..
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. రెండ్రోజుల కిందట అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ బాధితురాలి ఇంట్లోని కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయగా నలుగురికి లక్షణాలు ఉన్నట్టు తేలింది. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు వెంటిలేషన్ మీద ఉన్నట్టు తెలిసింది. ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలకు కరోనా రావడంతో ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు.
డిసెంబర్-2023లో హైదరాబాద్ జిల్లాలో నమోదైన కరోనా కేసులు ఇలా..
తేదీ కేసులు(హైదరాబాద్)
16 1
17 0
18 1
19 4
20 6
21 4
22 8
23 9
24 5
25 9