ఇజ్రాయిల్‌ జైళ్ళలో మగ్గుతున్న 3480మందికి పైగా పాలస్తీనియన్లు

ఇజ్రాయిల్‌ జైళ్ళలో మగ్గుతున్న 3480మందికి పైగా పాలస్తీనియన్లుగాజా : ఎలాంటి అభియోగాలు లేదా విచారణ లేకుండా 3,480మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ జైళ్ళలో మగ్గుతున్నారని ఖైదీల హక్కుల గ్రూపైన పాలస్తీనియన్‌ ప్రిజనర్స్‌ క్లబ్‌ (పిపిసి) శుక్రవారం పేర్కొంది. ఇలా జైళ్ళలో మగ్గిపోతున్న వారిలో 40మంది పిల్లలు, 11మంది మహిళలతో పాటూ జర్నలిస్టులు, శాసనకర్తలు, హక్కుల కార్యకర్తలు కూడా వున్నారని తెలిపింది. ఇజ్రాయిల్‌ ఆక్రమిత జైళ్ళలోని రాజకీయ ఖైదీలకు మద్దతుగా 1993లో పిపిసి ఏర్పడింది. వీరందరినీ ‘పాలనాపరమైన నిర్బంధం’ పేరు కింద జైల్లో వుంచుతున్నారని పిపిసి పేర్కొంది. వెల్లడించని సాక్ష్యాధారాల ప్రాతిపదికన మూడు నుండి ఆరు మాసాల పాటు పాలస్తీనియన్లను నిర్బంధిస్తూ వుంటారు. ఆసమయంలో నిందితుని లాయర్‌ కూడా వారిని కలవడానికి వీలుండదు. ఈ తరహా నిర్బంధం సరైన జ్యుడీషియల్‌ క్రమాన్ని ఉల్లంఘిస్తోందని పాలస్తీనియన్లు, అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపులు విమర్శిస్తున్నాయి. ఎలాంటి అభియోగాలు నమోదు చేయకపోయినా, విచారించకుండా, దోష నిరూపణ లేకుండా సుదీర్ఘకాలం పాటూ ఇలా నిర్బంధించడానికి వారిపై ఎలాంటి సాక్ష్యాధారాలు అందచేయాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వుంటోంది.
ఇదిలావుండగా, అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు తిరస్కరించారు. కాల్పుల విరమణ ప్రణాళికకు హమస్‌ ప్రతిస్పందన భ్రమలు కలిగించేలా వుందని నెతన్యాహు విమర్శించారు. సంపూర్ణ విజయం సాధించేవరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.