నెపిడా : పశ్చిమ రాఖినె రాష్ట్రంలోని గ్రామంలో ఈ వారంలో మయన్మార్ సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 40మందికి పైగా మరణించారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మయన్మార్‌లో దాదాపు నాలుగేండ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. రాఖినె ప్రాంత స్వయం ప్రతిపత్తి కోసం అక్కడి మిలీషియా అరకన్ ఆర్మీ, ప్రభుత్వంతో పోరాడుతోంది. కియూక్‌ని మావ్ గ్రామంపై బుధవారం మధ్యాహ్నం జుంటా జరిపిన దాడిలో 500కిపైగా ఇండ్లు ధ్వంసమయ్యాయని, 40మందికి పైగా మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి కూడా శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. కాగా పౌరులపై తామెలాంటి దాడులకు దిగలేదని జుంటా పేర్కొంది. తీవ్రవాదులతోనే తమ పోరాటమని వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా, ఈ దాడిలో మరణించిన 26మంది ముస్లింల పేర్లను అరకన్ ఆర్మీ వెల్లడించింది. మరో 12మంది గాయపడ్డారని తెలిపింది. అంతర్జాతీయ మానవతా చట్ట నిబంధనలకు అందరూ కట్టుబడి వుండాలని ఐక్యరాజ్య సమితి అన్ని పక్షాలకు పిలుపిచ్చింది.