న్యూయార్క్ : ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా మారింది. ఎప్పుడు తీసేస్తారో తెలియని ఆందోళనలో టెకీలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఉద్యోగాల సృష్టి ఏమో కానీ.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో సిస్టమ్స్ ప్రపంచ వ్యాప్తంగా 4వేల మంది తొలగించాలని నిర్ణయించింది. 2023 నాటికి సిస్కోలో 85 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 5 శాతం ఉద్యోగులను తొలగించాలని కంపెనీ తాజాగా పేర్కొంది. గతేడాది మాంద్యం భయాలతో ఐటి కంపెనీల్లో ప్రారంభమైన ఉద్వాసనలు ఈ ఏడాదీ కొనసాగడం ఆందోళనకరం. కొత్త ఏడాది 2024లోనూ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లింక్డిన్, మెటా తదితర దిగ్గజాలు ఒక్కొక్కటిగా ఉద్యోగుల తొలగింపునపై ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. గడిచిన పది రోజుల్లోనే ఫైనాన్సీయల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2,500 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. రోబోటిక్ వ్యాక్యుమ్ క్లీనింగ్ సొల్యూషన్స్ అందించే ఐరోబోట్ తన సిబ్బందిలో 31శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించింది.
వృద్థి, లాభదాయకతను కొనసాగించేందుకు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా దాదాపు 350 ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిపింది. కాగా.. ఆయా కంపెనీలు భారీ ఆదాయాలు, లాభాలు సాగిస్తున్నప్పటికీ.. మరింత పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.