పట్టుబడింది రూ.104 కోట్లకు పైనే..

– రాష్ట్రంలో నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్‌ స్వాధీనం
– కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసు సోదాల్లో..
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదివారం(28నాటికి) వరకు పోలీసులు జరిపిన దాడులలో భారీ మొత్తంలో నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకో వటం జరిగిందని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఆదివారం తెలిపారు. స్వాధీనప ర్చుకున్న పైవాటి విలువ రూ.104 కోట్లకు పైగా ఉన్నదని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనల కు విరుద్ధంగా ఏ పార్టీ వ్యవహరించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ స్క్వాడ్‌లను రూపొందించి ఎన్నికల కోడ్‌ అమలు అయిన నాటి నుంచి అనుమానిత ప్రాంతాలపై దాడులను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపా రు. అంతేగాక, ఇతర రాష్ట్రాలు ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో 89 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సోదాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో సైతం తమకు అందిన సమాచారం మేరకు డబ్బుల ను అక్రమంగా రవాణా చేస్తున్నవారితో పాటు మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకోవటం జరిగిందని డీజీపీ తెలిపారు. ఈ సోదాలలో రూ.63.41 కోట్లకు పైగా నగదు, రూ.5.38 కోట్లకు పైగా విలువైన మద్యం, రూ.7.12 కోట్లకు పైగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.