సాధారణం కంటే ఎక్కువే..

సాధారణం కంటే ఎక్కువే..– రాబోయే రుతుపవనాలపై ఐఎండీి అంచనా
న్యూఢిల్లీ : ఈ ఏడాది రుతపవనాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సానుకూలమైన అంచనానే వెల్లడించింది. దేశంలో రుతుపవనాల కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదవుతుందని సోమవారం తన ముందస్తు అంచనాను ప్రకటించింది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి లా నినా పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వివరాలను ఇక్కడ జరిగిన విలేకరులు సమావేశంలో ఐఎండీ చీఫ్‌ మృత్యుంజరు మహపాత్ర వెల్లడించారు.
నాలుగు నెలల (జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు) రుతుపవనాల సీజన్‌ల్లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, దీర్ఘకాల వర్షపాతం సగటు (87 సెంమీ) యొక్క సంచిత వర్షపాతం 106 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ వర్షకాలంలో హిందూమహాసముద్రంపై పరిస్థితులు మేఘాల కదలికలకు అనుకూలంగానే ఉంటాయని, ఉత్తరార్ధ గోళంలో మంచు కవచం తక్కువగానే ఉంటాయని.. ఇవన్నీ రుతుపవనాలకు సానుకూల అంశాలని చెప్పారు. ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ఒక మోస్తారుగా నెలకొని ఉన్నాయని, వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఇది కొంచెం తగ్గుతుందని, ఆ తరువాత అంటే ఆగస్టు-సెప్టెంబరు నాటికి లా లినా పరిస్థితులు నెలకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎల్‌నినో ఉంటే వేడిగాలులు, లా లినా ఉంటే ఎక్కువ వర్షాలకు అనుకూలంగా ఉంటుంది. గత ఏడాదిలో ఎల్‌నినో కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.
దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షం రుతుపవనాల కారణంగానే కురుస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి ఇది ఎంతో కీలకం. అలాగే, మహారాష్ట్రల్లోని ముంబయి, థానే, రారుగఢ్‌ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌ వరకూ నమోదయ్యే అవకాశ ఉందని తెలిపింది.