అంతకుమించి…

Moreover...‘పుష్ప-2 ది రూల్‌’ పాన్‌ ఇండియా సినిమాతో అల్లు అర్జున్‌ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రం ‘పుష్ప1’. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని నటనకి అల్లుఅర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది.
సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్ర ఈవెంట్‌ను కొచ్చిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, ‘గత 20 ఏండ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌తో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో ఆయన నటన చూసి మీరంతా గర్వపడతారు. అలాగే రష్మిన తన నటనతో మెప్పిస్తుంది. సుకుమార్‌ నా కెరీర్‌లో ‘ఆర్య’ను ఇచ్చాడు. ఆ చిత్రంతోనే నా మార్కెట్‌ కేరళలో స్టార్ట్‌ అయ్యింది. నేను మీకు ఇంత దగ్గరయ్యానంటే సుకుమారే కారణం. నా కెరీర్‌లో దేవి శ్రీ ప్రసాద్‌ ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. మైత్రీ నవీన్‌, రవి, చెర్రీ సపోర్ట్‌ వల్ల ఈ సినిమా సాధ్యమైంది. డిసెంబరు 5న పదకొండు వేలకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. వైల్డ్‌ ఫైర్‌తో సినిమా ఉంటుంది. ఎంజారు చేయండి. ఇకపై త్వరగా సినిమాలు చేస్తాను’ అన్నారు.
‘మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్‌ మీద ఉన్న మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లుఅర్జున్‌ నా జీవితంలో ఓ ప్రత్యేకమైన పర్సన్‌. ఈ సినిమాలో ప్రతి బిట్‌ను అందరూ ఎంజారు చేస్తారు. వీలుంటే మీతో కలసి సినిమా చూస్తా’ అని రష్మిక మందన్నా చెప్పారు.

ఓ రోజు దేవిశ్రీప్రసాద్‌కి ఫోన్‌ చేసి, నా కేరళ అభిమానులకు ప్రేమ చూపించాలి అన్నాను. ఈ సినిమాలో మలయాళ లిరిక్స్‌తో ఓ సాంగ్‌ చేశాం. అన్ని భాషల్లో మలయాళం లిరిక్స్‌ ఉంటాయి. మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నాను. మలయాళీ ఫ్యాన్స్‌ ఆర్మీ అనే పదాన్ని స్టార్ట్‌ చేశారు. ఈ పాటలో వింటేజ్‌ బన్నీని చూస్తారు. పుష్ప పాత్రలో ‘పుష్ప-1’లో డ్యాన్సులు చేయడం కుదరలేదు. ఆరు లాంగ్వేజ్‌ల్లో ఈ పాట మలయాళంలోనే హుక్‌ లైన్‌ ఉంటుంది.
– అల్లు అర్జున్‌