పొద్దునా…సాయంత్రం కరెంట్‌ షాక్‌

– పీక్‌ డిమాండ్‌ పేరుతో అధిక విద్యుత్‌ చార్జీలు
– గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
– రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మోడీ సర్కారు ఎవర్నీ వదలట్లేదు. ప్రభుత్వం అందించే ఏ సేవా ఉచితం కాదు. అన్నింటికీ డబ్బు చెల్లించాల్సిందే. తొలుత నామమాత్రంగా రుసుములు పెట్టి, ఆ తర్వాత వివిధ రకాల పేర్లతో చార్జీలు పెంచేసి సామాన్యుడిని బాదేయడం మోడీ సర్కారు ప్రత్యేకత! ఇప్పుడు ఇదే తరహాలో పీక్‌ డిమాండ్‌ పేరుతో కరెంటు చార్జీలనూ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఎవరికైనా సహజంగా కరెంటుతో ఎప్పుడు పని ఉంటుంది? ఉదయం పిల్లల్ని స్కూళ్లకు తయారు చేయడం దగ్గరి నుంచి ఆఫీసులు, రోజువారీ పనులకు వెళ్లే టైం ఉదయం 6 నుంచి 10 గంటల లోపే…అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇండ్లలో లైట్లు, ఫ్యాన్లు వేసుకొని పనులు చేసుకుంటారు. ఇప్పుడు మోడీ సర్కారు దృష్టి ఈ ‘టైం’పై పడింది. ఆ టైంలో కరెంటు వాడితే అధిక చార్జీలు వసూలు చేయాలంటూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పైగా దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలనీ ఆదేశించారు. దీనికి పర్యావరణహితం హ్యాష్‌ట్యాగ్‌ కట్టి కర్బన ఉద్గారాలు తగ్గించి, సాంప్రదాయ ఇంధన వనరులు…సోలార్‌, విండ్‌, జలవిద్యుత్‌ వంటి వాటిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం అంటూ ప్రకటించారు. మోడీ సర్కారు చెప్తున్న ‘సంప్రదాయ ఇంధన వనరులు’ అన్నీ ఇప్పటికే ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. అంతిమంగా వారికి లబ్ది చేకూర్చడమే కేంద్రం లక్ష్యమని స్పష్టమవుతుంది. దానికోసం ‘పీక్‌ అవర్‌’ పేరుతో జనాన్ని బాదేసేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే వంటింట్లో గ్యాస్‌ బండ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసి, దాని ధరను రూ.1,200 చేర్చిన విషయం తెలిసిందే. 2023 విద్యుత్‌ సంస్కరణల పేరుతో భవిష్యత్‌లో కరెంటు బిల్లుల్ని ఇదే తరహాలో పెంచడమే మోడీ సర్కారు లక్ష్యంగా పనిచేస్తున్నది. పీక్‌ అవర్‌లో కరెంటు వాడితే అధిక చార్జీలు చెల్లించాలి. ఆ తర్వాత వాడే కరెంటు చార్జీల్లో 20 శాతం రాయితీ అంటూ ‘బట్టల దుకాణాల్లో వ్యాపారులు ఇచ్చే డిస్కౌంట్ల’ తరహాలో ప్రకటన చేసింది. ముందే టారిఫ్‌ రేట్లు పెంచేసి, దానిలో 20 శాతం రాయితీ అంటూ మరో మోసపూరిత వ్యాపారానికి మోడీ ప్రభుత్వం తెరలేపిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ కొత్త విధానాలు 2024 ఏప్రిల్‌ 1 నుంచి తొలుత 10 కిలోవాట్ల లోపు వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమలు చేస్తారు. గృహ వినియోగదారుల కరెంటు కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించి, 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక్కడితో ఈ ‘దందా’ నిలిచిపోవట్లేదు. కరెంటు కనెక్షన్‌ తీసుకొనేటప్పుడు వినియోగదారుడు ఎన్ని కిలోవాట్లు వాడుకుంటారో ముందే చెప్పాలి. అంతకుమించి ఎక్కువ వాడుకుంటే జరిమానాలు, సర్‌చార్జీల పేరుతో ఏడాదికోసారి వడ్డీతో సహా లెక్కించి బిల్లులు పంపుతారు. కడితే సరి…లేకుంటే కనెక్షన్‌ కట్‌! మోడీనా…మజాకా!!